నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా..

జోగులాంబ గద్వాల జిల్లాలో 21 ఏళ్ల తర్వాత ఓ మహిళ తన కుమారుడితో కలిసి ఓ వ్యక్తి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి సహజీవనం చేసి, కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదని ఆమె ఆరోపించింది. తన కుమారుడికి తండ్రి గుర్తింపు కావాలని డిమాండ్‌ చేసింది. అవసరమైతే DNA పరీక్షకు సిద్ధమని తల్లి, కుమారుడు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని స్టేషన్‌కు తరలించి, కౌన్సిలింగ్ ద్వారా సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట తల్లి ధర్నా..
Gadwal Woman Protest

Edited By:

Updated on: Aug 30, 2026 | 10:08 AM

నా బిడ్డకు తండ్రి నువ్వే… అంటూ 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ఇంటి ఎదుట ధర్నా చేసిన ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. ఆనాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సహజీవనం చేసి కుమారుడు పుట్టిన తర్వాత పట్టించుకోలేదంటూ మహిళ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. వివరాల ప్రకారం.. గద్వాల పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రేణుక… భీమ్ నగర్ కు చెందిన ఓ ఇంట్లో చిన్నతనం నుంచి పనిమనిషిగా ఉండేది. వయసు వచ్చిన తర్వాత ఇంటియజమాని కొడుకు తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించడంతో అతడితో సన్నిహితంగా మెలిగినట్లు చెబుతోంది. కొంతకాలానికి తాను గర్భం దాల్చగా… విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో పరిస్థితి మారిపోయిందని చెప్పింది. అయితే గర్భం తొలగించేందుకు మాత్రలు ఇచ్చారని.. అవి పనిచేయకపోవడంతో చివరకు కుమారుడికి జన్మనిచ్చిట్లు రేణుక తెలిపింది. బిడ్డ పుట్టిన తర్వాత మాత్రం అతడు తనను పెళ్లి చేసుకోలేదని, తమ బాధ్యత తీసుకోలేదని ఆరోపించింది. అప్పటి నుంచి తన కుమారుడిని తండ్రిలేని బిడ్డగా ఒంటరిగానే పెంచుకుంటూ వచ్చానని చెప్పింది.

ఇక కాలం గడిచింది.. కుమారుడికి ఇప్పుడు 21 ఏళ్లు వచ్చాయి. ఇన్నేళ్లుగా మౌనంగా ఉన్న ఆమె… ఇకనైనా తన కుమారుడికి తండ్రి గుర్తింపు రావాలని కోరుతూ ఆందోళనకు దిగింది. సంబంధిత వ్యక్తి చక్రపాణి ఇంటి ఎదుట కుమారుడితో కలిసి కూర్చొని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసింది. చాలా రోజుల నుంచి విషయాన్ని చక్రపాణి దృష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడం లేదని… చేసేది లేక ఇంటిముందు కూర్చోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

అనుమానాలు ఉంటే DNA పరీక్ష కు సైతం తాము సిద్ధంగా ఉన్నామని రేణుక, ఆమె కుమారుడు చెబుతున్నారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని తల్లి, కుమారుడిని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ వ్యవహారంపై త్వరలోనే కౌన్సిలింగ్ నిర్వహించి పరిష్కారానికి ప్రయత్నం చేసే యోచనలో పోలీసులున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us