
జయశంకర్ భూపాలపల్లి జిల్లా అడవుల్లో భారీ అడవి దున్నలు కలకలం రేపుతున్నాయి.. ఆ మార్గంలో వెళ్లే బాటసారులను వణికిస్తున్నాయి.. తాజాగా కాటారం నుంచి మేడారం వెళ్లే ప్రధాన రహదారిపై భారీ అడవి దున్నలు రోడ్డుపై సంచరిస్తూ జనాన్ని పరుగులు పెట్టించాయి.. సాయంత్రం 7 గంటల సమయంలో ఈ అడవి దున్నలు ప్రత్యక్షం అయ్యాయి.. వాహనదారులు భూపాలపల్లి నుంచి కాటారం వస్తున్న క్రమంలో మల్లంపెళ్లి స్టేజి దాటి సుమారుగా రెండు కిలోమీటర్లు దూరం రాగానే అడవిదున్నలు రోడ్డుపై కనిపించాయి. అవి కుడివైపు నుంచి ఎడమ వైపుకు రోడ్డు దాటుతున్న క్రమంలో కొంతసేపు రోడ్డుపై ఆగాయి.. అడవి దున్నను చూసి వాహనదారులు ఉలిక్కిపడ్డారు.. కొంతసేపు వాహనాలు ఎక్కడికక్కడే నిలిపివేశారు.. కొంతమంది వాహనదారులు వాటిని సెల్ ఫోన్లలో చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
నిత్యం వాహనాల రద్దీ కాళేశ్వరం కి వెళ్ళే ప్రధాన రహదారిపై అడవి దున్నలు ప్రత్యక్షం అవడం కలకలం రేపింది.. ఈ అడవుల్లో ఇంకా ఎన్ని అడవి దున్నలు ఉన్నాయో..! ఎన్ని రకాల వన్య ప్రాణులు ఉన్నాయో అనే చర్చ జరుగుతుంది.. అయితే వాహనదారులు ఇలా తారసపడిన జీవులకు ఎలాంటి హాని తలపెట్టవద్దని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు..ఎవరైనా వాటిని హింసించినట్లయితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు.
ఇవి భారతదేశంలో కనిపించే అతిపెద్ద అడవి పశువుల జాతుల్లో ఒకటి. పెద్ద ఎద్దుల్లా కనిపిస్తాయి. బలమైన కండరాలు, నల్లటి లేదా గోధుమ రంగు శరీరం, తెల్లటి కాళ్లు వీటి ప్రత్యేకత. ఒక పెద్ద మగ గౌర్ బరువు 700 నుంచి 1000 కిలోల వరకు ఉండొచ్చు. తెలంగాణలో ముఖ్యంగా ఉత్తర-తూర్పు అటవీ ప్రాంతాల్లో అప్పుడప్పుడు ఇవి కనిపిస్తుంటాయి. మహారాష్ట్రలోని తడోబా, ఛత్తీస్‌గఢ్, గోదావరి అటవీ బెల్ట్‌ల నుంచి వలసగా సంచరిస్తూ ఈ ప్రాంతాలకు రావచ్చని అటవీశాఖ అధికారులు చెబుతుంటారు. ముఖ్యంగా వర్షాకాలం ముందు లేదా నీటి, ఆహార వనరుల కోసం ఇవి రహదారుల దగ్గరికి వస్తుంటాయి. ఇవి సాధారణంగా మనుషులపై దాడి చేయవు. కానీ భయపెడితే, వాహనాలతో దగ్గరగా వెళ్లితే లేదా ఫ్లాష్‌లైట్లు వేస్తే ఒక్కసారిగా దూకుడుగా మారే అవకాశం ఉంటుంది. దగ్గరకు వెళ్లకూడదు. హారన్‌లు ఎక్కువగా కొట్టకూడదు. ఫోటోలు తీసేందుకు వెంబడించకూడదు. రాత్రివేళల్లో అడవి రహదారుల్లో జాగ్రత్తగా ప్రయాణించాలి.