Weather Department: ఈసారి ఎండలు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో ఈసారి సూర్యుడు ప్రతాపం చూపే అవకాశం ఉందని తెలిపారు. ఫిబ్రవరిలో ఒకటి, రెండు రోజులు గరిష్ఠ ఉష్ణోగ్రతలు కాస్త తగ్గుముఖం పట్టినా.. వెంటనే పెరుగుతాయని, మార్చి 1 నుంచి ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు అధికంగా నమోదయ్యే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌లో 40 డిగ్రీల నుంచి 42 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని చెబుతున్నారు.
కాగా, ప్రతి ఎండాకాలంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, గోదావరిఖని ప్రాంతల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత ఎక్కువగా నమోదయ్యే అవకాశాలున్నాయంటున్నారు. గత సంవత్సరం వేసవిలో లాక్‌డౌన్ కారణంగా ప్రజలకు పెద్దగా వేసవి ప్రభావం కనిపించలేదని, 2020 వేసవి కాలం అంతా లాక్‌డౌన్‌తో ఇళ్లల్లోనే గడిచిపోయింది. వడదెబ్బ మరణాలు కూడా కనిపించలేదన్నారు. కానీ ఈ సారి ఆ పరిస్థితి ఉండదని, దీనికి తోడు ఈసారి వేసవి కాలం సీజన్ కంటే నెల ముందుగానే ఉష్ణోగ్రతల్లో పెరుగుదల ఉంటుందని వాతావరణ అధికారులు వెల్లడిస్తున్నారు.