
వేసవి ఎండలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్నాయి. అదివారం (జూన్ 7, 2026) నాటికి పశ్చిమ-మధ్య, ఈశాన్య బంగాళాఖాతం అంతటా రుతుపవనాలు ప్రవేశించాయి. వీటితో పాటు వాయువ్య బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, మణిపూర్, మిజోరాంలను పూర్తిగా కవర్ చేస్తూ.. త్రిపుర, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్‌లలోని కొన్ని ప్రాంతాలకు ఇవి మరింత విస్తరించాయి.
తెలంగాణ వైపు రుతుపవనాల పయనం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం.. రాబోయే 2 నుంచి 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి, అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. ప్రస్తుతం తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఛత్తీస్‌గఢ్ మీదుగా తెలంగాణ వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఒక ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.
ఆదివారం, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. అయితే గరిష్ట ఉష్ణోగ్రతల్లో రానున్న మూడు రోజులు పెద్దగా మార్పులు ఉండవని అధికారులు స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్, యానాంలలో వాతావరణ సూచన
అమరావతి వాతావరణ కేంద్రం నివేదిక ప్రకారం, ప్రస్తుతం కోస్తా కర్ణాటక పరిసర ప్రాంతాల నుండి కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సుమారు 14° ఉత్తర అక్షాంశం వెంబడి సముద్ర మట్టానికి 3.1 నుండి 4.6 కిలోమీటర్ల ఎత్తులో ఒక అల్పపీడన ద్రోణి విస్తరించి ఉంది. దీని ఫలితంగా ఏపీలోని వివిధ ప్రాంతాలలో రాగల మూడు రోజులు వాతావరణం ఇలా ఉండనుంది. రేపు సోమవారం ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడవచ్చు. అక్కడక్కడ వడగాలులు వీచే ప్రమాదం ఉంది. అలాగే ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఎల్లుండి తేలికపాటి వర్షాలతో పాటు వాతావరణంలో వేడి, తేమ పెరిగి తీవ్ర అసౌకర్యంగా మారే అవకాశం ఉంది. ఈదురుగాలులు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు.
దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్:
ఈరోజు, రేపు ఒకటి లేదా రెండు చోట్ల తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. కొన్ని ప్రాంతాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. ఇక ఎల్లుండి కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావంతో పాటు వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
రాయలసీమ ప్రాంతం:
ఈరోజు రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. రేపు, ఎల్లుండి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడతాయి. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ముఖ్యంగా కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం, రాయలసీమ ప్రాంతాలలో రాబోయే 5 రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలలో పెద్దగా మార్పులు ఉండకపోయినా, ఎండల తీవ్రత కొద్దిగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం సంచాలకులు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…