
వరంగల్, జనవరి 27: విధులు ముగించుకొని భర్తతో కలిసి ఇంటికి వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో 9 నెలల గర్భవతి అయిన వైద్యురాలు మరణించిన ఘటన వరంగల్ జిల్లాలో వెలుగు చూసింది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా చించోలి మండలం బత్తంపల్లికి చెందిన మమతారాణి అనే వైద్యురాలికి నారాయణపేట జిల్లాకు చెందిన డాక్టర్ రాగవేంద్ర ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే వీరు ప్రస్తుతం వరంగల్ నగరంలోని హంటర్‌రోడ్డులోని ఫాదర్ కొలంబో ఆస్పత్రిలో జనరల్ మెడిసిన్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నారు.
అయితే వైద్యురాలు మమత ప్రస్తుతం 9 నెలల గర్భిణిగా ఉన్నారు. సోమవారం రాత్రి హాస్పిటల్ విధులు ముగిసిన తర్వాత ఆమె తన భర్త రాగవేంధ్రతో కలిసి బైక్‌పై ఇంటికి వెళ్లేందుకు బయల్దేరారు. సరిగ్గా ఏడు మోరీల జంక్షణ వద్దకు రాగానే వెనక నుంచి వేగంగా దూసుకొచ్చిన ఓ టిప్పర్ భార్యభర్తలు వెళ్తున్న బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో భర్తకు కాస్త స్వల్పగాయాలే కాగా.. గర్భవతి అయిన మమతకు మాత్రం తీవ్ర గాయాలయ్యారు. దీంతో భర్త వెంటనే స్థానికుల సహాయంతో ఆమెను హాస్పిటల్‌కు తరలించారు.
అయితే అక్కడ మమతను పరీక్షించిన వైద్యులు చికిత్స అందించారు. కానీ చికిత్స పొందుతూనే 9 నెలల గర్భిణి అయిన మమత ప్రాణాలు కోల్పోయింది. అది విన్న భర్త కన్నీరుమున్నీరుగా విలపించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానిరి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ అన్సారీని అదుపులోకి తీసుకున్నారు. డ్రైవర్ ఝార్ఖండ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనపై కేసు నమెదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.