
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో ప్రస్తుతం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మాత్రమే అందుబాటులో ఉండగా.. రానున్న రోజుల్లో మరో ఎయిర్‌పోర్ట్ కూడా రానుంది. అదే వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్. ఈ కొత్త ఎయిర్ పోర్ట్‌పై తాజాగా కీలక ముందడుగు పడింది. రూ.213.59 కోట్లతో ఎయిర్ పోర్ట్ అభివృద్ది పనులకు టెండర్ షెడ్యూల్ ప్రకటించారు. డొమెస్టిక్ టెర్మినల్, ఏటీసీ టవర్ నిర్మాణానికి తాజాగా టెండర్లను ఆహ్వానించారు. ఇక ఫైర్ స్టేషన్, సబ్ స్టేషన్, ఈ అండ్ ఐ వర్క్ షాప్ నిర్మాణం చేయనున్నారు. 18 నెలల్లో పనులు పూర్తి చేయాలని ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధన విధించింది. ఈ నెల 28వ తేదీన ఎయిర్‌పోర్టులో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించనున్నారు. అక్టోబర్ 6వ తేదీ నుంచి నవంబర్ 3వ తేదీ వరకు బిడ్ల దాఖలుకు అవకాశం కల్పించారు.
నవంబర్ 9వ తేదీన టెక్నికల్ బిడ్లను తెరవనున్నారు. నవంబర్ 30న ఫైనాన్షియల్ బిడ్లను ఓపెన్ చేయనున్నారు. తాజాగా ఈ ఎయిర్ పోర్ట్ పనులపై అధికారులతో కలెక్టర్ డాక్టర్ సత్యశారద సమీక్ష నిర్వహించారు. అభివృద్ది పనులు, మౌలిక సదుపాయాలు, ఇతర అంశాలపై చర్చించారు. పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే ఇప్పటికే ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతులు జారీ చేసింది. రూ.496.86 కోట్ల అంచనాతో అనుమతులు ఇచ్చింది. భూసేకరణ, చట్టబద్దమైన అనుమతులు, మౌలిక సదుపాయాల బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. దీంతో ఇప్పటికే ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ పూర్తి చేయగా.. ఇప్పుడు పనుల కోసం టెండర్లను ఆహ్వానించింది. దీంతో త్వరలోనే ఎయిర్‌పోర్ట్ పనులు మొదలుకానున్నాయి.
త్వరలోనే ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీని శంకుస్థాపనకు ఆహ్వానించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అటు మామునూరు ఎయిర్‌పోర్టుతో పాటు ఆదిలాబాద్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం ఎయిర్‌పోర్టుల కోసం ప్రతిపాదనలు సిద్దం అయ్యాయి. అయితే మామునూరు ఎయిర్‌పోర్టును కాకతీయ స్ట్రైల్లో డిజైన్ చేయనున్నారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా డిజైన్‌కు రూపకపల్పన చేశారు. అటు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై కూడా కీలక అప్డేట్ వచ్చింది. ఇప్పటికే భూసేకరణ కోసం కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. చుట్టపక్కల గ్రామాల్లో భూమిని సేకరించనున్నారు. ఈ ఏడాదిలోనే ఎయిర్‌పోర్ట్ పనులను స్టార్ట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్, ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ పూర్తయితే రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపయోగం జరగనుంది. కొత్త కంపెనీల ఏర్పాటు, లాజిస్ట్రిక్స్ రంగం అభివృద్ది చెందటం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. దీని వల్ల లాజిస్ట్రిక్ కంపెనీలకు కూడా లభం జరగనుంది.