రాజకీయాలకు అతీతంగా గ్రామాలను అభివృద్ది చేసుకోవాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపురంలో గ్రామ పంచాయతీలలో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుపై వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ప్రజాప్రతినిధులు, అధికారుల సమావేశానికి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పచ్చదనం పెంచాలని ఆయన సూచించారు. ప్రజలు శ్రమదానం ద్వారా తమ గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని ఆయన చెప్పారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి విరివిగా విరాళాలు ఇవ్వాలని ఆయన కోరారు. గట్లనర్సింగాపూర్ అభివృద్ధి కోసం భాస్కర్ రావు అనే వ్యక్తి రెండు కోట్ల రూపాయలను విరాళంగా ఇవ్వడం హర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, సుధీర్, ఎంపీలు బండ ప్రకాష్, పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ అరూరి రమేశ్ గారు, చల్లా ధర్మారెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కిషన్ రావు, కలెక్టర్లు ప్రశాంత్ పాటిల్, హరిత పాల్గొన్నారు.