Vegetable Price: కొండెక్కిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..

వర్షాలు ఆగాయి.. వరదలు తగ్గాయి. సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. కూరగాయాల ధరలు కొండెక్కడంతో నోట్లోకి నాలుగు మెతుకులు పోయే పరిస్థితి లేదంటూ ప్రజలు లబోదిబోమంటున్నారు.

Vegetable Price: కొండెక్కిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లు ఎలా ఉన్నాయంటే..
Vegetables Prices

Updated on: Sep 15, 2024 | 8:01 PM

వర్షాలు ఆగాయి.. వరదలు తగ్గాయి. సామాన్యుడికి కష్టాలు పెరిగాయి. వరద నష్టం కూరగాయలపై పడింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరోసారి కూరగాయల ధరలు కొండెక్కాయి. సామాన్యులు కొనే పరిస్థితి లేకుండా పోతుంది. భారీ వర్షాల కారణంగా చాలా చోట్ల పంట నష్టపోవడంతో.. దిగుబడి తగ్గింది. దీంతో కూరగాయల ధరలు మండిపోతున్నాయి.. దాదాపు అన్ని రకాల కూరగాయల ధరలు సెంచరీకి చేరువయ్యాయి. ఈ‌సీజన్‌లో అందరికి‌ అందుబాటులో ఉండే కూరగాయాలు, ఆకుకూరల ధరలు.. భారీ వర్షాల కారణంగా పెరిగిపోయాయి. ముందుముందు.. మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. దీంతో కూరగాయల సాగు దెబ్బ తీసింది. గణనీయంగా కూరగాయల దిగుబడి తగ్గింది. చాలాచోట్ల కూరగాయల తోటలు మునిగిపోయాయి. మరికొన్ని కోట్ల వరదలకు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం ‌బహిరంగ‌ మార్కెట్ లో అన్ని రకాల ‌కూరగాయాల ధరలు నలభై శాతం ‌వరకు పెరిగాయి.

టామాటాలు రూ.40 నుంచి 50 వరకు పలుకుతుండగా.. పచ్చి మిర్చి కిలోకి 70.. చిక్కుడు కిలో 100, బీరకాయ 80, బెండకాయ 70, క్యారెట్ వంద, కాకరకాయ 80, క్యాలీఫ్లవర్ 80, అకుకూరలు కట్ట 20, కొత్తిమీర, పుదీనా కట్ట 50నుంచి 100 పలుకుతోంది. గతంలో మూడు వందల రూపాయల కూరగాయలు ‌కొనుగోలు చేస్తే వారానికి సరిపడా వచ్చేవి.. ఇప్పుడు.. ‌కనీసం రెండు రోజులకి కూడ సరిపోయే కాయగూరలు రావడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లిగడ్డలు కూడా కిలో 60 నుంచి 70 పలుకుతున్నాయి.

ఈ ధరలు కొత్త పంటలు వచ్చే వరకూ కంటిన్యూ అవుతాయని వ్యాపారస్తులు చెబుతుతున్నారు. ఈ నేపథ్యంలో కూరగాయల‌ ధరలు సామాన్యడికి అందుబాటులోకి వచ్చేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని హైదరాబాద్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..