
నల్గొండ, ఆగస్ట్ 7: ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికైన నాగార్జునసాగర్.. ఇప్పుడు మరో అరుదైన ఆధ్యాత్మిక కార్యక్రమానికి సిద్ధమవుతోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని… సాగర్‌తో పాటు అన్ని జలాశయాలు నిండాలని.. రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పిస్తూ నిర్వహిస్తున్న ఈ యాగంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననుండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సాగు, తాగు నీరు లేక జనం అల్లాడుతున్నారు. ఇలాంటి సమయంలో ప్రకృతి కరుణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది.
తెలుగు రాష్ట్రాలను సస్యశ్యామలం చేసిన కృష్ణమ్మ ఒడ్డున నాగార్జునసాగర్ వేదికగా వరుణ యాగానికి శ్రీకారం చుట్టబోతోంది. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని, కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, రైతాంగం సుభిక్షంగా ఉండాలని సంకల్పించిన ఈ యాగంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆగస్టు 10న విజయవిహార్ ప్రాంగణంలో వరుణ యాగం జరగనుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో 108 మంది వేద పండితులు, 11 హోమ గుండాల మధ్య శాస్త్రోక్తంగా యాగం నిర్వహించనున్నారు. ఈ యాగంలో అత్యంత కీలక ఘట్టమైన సకల పూర్ణాహుతి మహోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికార యంత్రాంగం భారీ ఏర్పాట్లు చేస్తోంది. వరుణ యాగం కోసం జిల్లా కలెక్టర్ చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్, దేవాదాయశాఖ అధికారులు, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయ అర్చకులు స్థల పరిశీలన చేశారు.
ఈ యాగం వెనుక ఉన్న లక్ష్యం కేవలం సంప్రదాయం కాదు.. రాష్ట్ర సంక్షేమం. ఎల్‌నినో ప్రభావం తెలంగాణపై పడకుండా ఉండాలని.. కృష్ణా, గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని.. సాగర్‌తో పాటు అన్ని ప్రాజెక్టులు, చెరువులు నిండాలని ప్రభుత్వం ఆకాంక్షిస్తోంది. రైతు పంట పండితేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే సందేశంతో ఈ యాగాన్ని రేవంత సర్కార్ నిర్వహించనుంది.