AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ జీసీసీ.. లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో దూసుకెళ్తున్న ఐటీ రంగం

SplashBI GCC In Hyderabad: హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన SplashBI కొత్త గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ప్రారంభించింది. వచ్చే ఐదేళ్ల నుంచి ఏడేళ్లలో రూ.800 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. ఈ విస్తరణ ద్వారా 275 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ జీసీసీ.. లక్ష కోట్ల పెట్టుబడుల లక్ష్యంతో దూసుకెళ్తున్న ఐటీ రంగం
Splashbi Gcc In Hyderabad
Prabhakar M
| Edited By: |

Updated on: Nov 09, 2026 | 4:40 PM

Share

SplashBI GCC In Hyderabad: హైదరాబాద్ అంతర్జాతీయ ఐటీ, టెక్నాలజీ హబ్‌గా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది. ప్రపంచ స్థాయి సంస్థలు నగరంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తుండగా.. తాజాగా అమెరికాకు చెందిన స్ప్లాష్‌బీఐ (SplashBI) హైదరాబాద్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ)ను ప్రారంభించింది. డేటా ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో సేవలందించే ఈ సంస్థ కొత్త కేంద్రం ద్వారా నగరంలో తన కార్యకలాపాలను విస్తరించనుంది.

100 మిలియన్ డాలర్ల పెట్టుబడులు

అమెరికాలోని జార్జియా రాష్ట్రం డులూత్ కేంద్రంగా పనిచేస్తున్న స్ప్లాష్‌బీఐ.. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో సుమారు 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన జీసీసీని ఏర్పాటు చేసింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో హైదరాబాద్‌లో 100 మిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులు పెట్టాలని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విస్తరణ ద్వారా 275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.

ఏఐ, డేటా ఇంటెలిజెన్స్‌పై ప్రత్యేక దృష్టి

హైదరాబాద్ కేంద్రంగా డేటా ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌తో పాటు స్ప్లాష్ ఏఐ సామర్థ్యాలను కూడా సంస్థ అభివృద్ధి చేయనుంది. ప్రపంచవ్యాప్తంగా 39 దేశాల్లో 500కు పైగా ఎంటర్‌ప్రైజ్ సంస్థలకు స్ప్లాష్‌బీఐ సేవలందిస్తోంది. కొత్త జీసీసీ ద్వారా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం, ఏఐ ఆధారిత పరిష్కారాలు, బిజినెస్ అనలిటిక్స్ రంగాల్లో మరిన్ని అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌లో 515కు పైగా జీసీసీలు

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ప్రస్తుతం 515కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు పనిచేస్తున్నాయని వెల్లడించారు. వీటిలో మూడు లక్షల మందికి పైగా నిపుణులు ఉపాధి పొందుతున్నారని పేర్కొన్నారు. గత ఏడాది దేశంలోనే అత్యధికంగా 70కు పైగా కొత్త జీసీసీలు హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో మరో 100 జీసీసీలను నగరానికి తీసుకురావడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

కేవలం సేవలకే పరిమితం కాకుండా.. ఆవిష్కరణలకు కేంద్రాలుగా

జీసీసీలను సంప్రదాయ సేవలందించే కేంద్రాలుగా కాకుండా.. ప్రపంచ స్థాయి ఉత్పత్తుల రూపకల్పన, పరిశోధన, సాంకేతిక ఆవిష్కరణలకు వేదికలుగా అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని మంత్రి వివరించారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ, ప్రొడక్ట్ ఇంజినీరింగ్ వంటి కీలక రంగాల్లో హైదరాబాద్‌ను అంతర్జాతీయ స్థాయి కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, ప్రణాళికలతో ముందుకెళ్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, స్ప్లాష్‌బీఐ సీఈఓ నవీన్ మిగ్లానీ, సంస్థ ప్రెసిడెంట్, సీటీఓ కిరణ్ రెడ్డి పాశం తదితరులు పాల్గొన్నారు.

Follow Us