
తెలంగాణలోని రైతులు మొబైల్ నుంచే యూరియా బుక్ చేసుకునేలా ఓ యాప్‌ను రాష్ట్ర సర్కార్ గతంలో అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ప్రయోగాత్మకంగా తొలుత ఐదు జిల్లాల్లో మాత్రమే ఈ యాప్ ద్వారా రైతులు బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. దుకాణాల వద్దకు వెళ్లి వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లో ఆన్‌లైన్ ద్వారా యూరియా బుకింగ్ చేసుకునే అవకాశం లభించింది. దీని వల్ల రైతులు తమ పంట కోసం యూరియా పొందటం సులువు అవ్వడంతో పాటు సమయం కూడా ఆదా అవుతుంది. ఇక దీని వల్ల యూరియా నిల్వలకు సంబంధించి జరుగుతున్న అక్రమాలకు కూడా చెక్ పడుతోంది. ఆన్లైన్ ద్వారా బుకింగ్స్ చేయడం ద్వారా యూరియా నిల్వలు ఎక్కడెక్కడ ఎంత ఉన్నాయి అనే వివరాలు కూడా ప్రభుత్వానికి తెలుస్తోంది. యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బందులు ఎదుర్కొవడంతో.. ప్రభుత్వం స్పందించి యాప్ తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు తమ పంటకు ఎంత అవసరమో అంత యూరియా మాత్రమే బుక్ చేసుకోగలుగుతారు.
ఇక నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని రైతులకు యూరియా బుకింగ్ యాప్ అందుబాటులోకి రానుంది. వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్రమంతటా యాప్ సేవలు ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఐదు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్ట్‌గా క్రింద ప్రవేశపెట్టగా విజయంతం అయిందని, దీంతో రాష్ట్రవ్యాప్తంగా తీసుకురానున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా యూరియా బుకింగ్ యాప్‌ను అభినందించిందన్నారు. సెక్రటేరియట్‌లో వ్యవసాయ శాఖపై తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలు చేశారు. విజన్-2047 లక్ష్యంగా కార్యాచరణ సిద్దం చేయాలని ఆదేశించారు. వ్యవసాయ యాంత్రీకరణ, ఆర్గానిక్ ఫార్మింగ్ అభివృద్ది చేయలని సూచించారు.
రైతులు ఆర్గానిక్ పంటలు పండిస్తున్నా.. మార్కెట్లో నకిలీ లేబులింగ్‌తో ఆర్గానిక్ ఉత్పత్తులు విక్రయిస్తున్నారు. దీంతో ఏది నికిలీది.. ఏది ఆర్గానిక్ ప్రోడక్ట్ అనేది తెలియడం లేదు. దీనిని అరకట్టి రైతుల ఆర్గానిక్ పంటల ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇవ్వాలని సూచించారు. ఇందుకోసం త్వరలో ఓ యాప్ తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ యాప్ వల్ల ఆర్గానిక్ పంటలు రైతులు ఎక్కడ పండించారు.. ఎల పండించారు అనే వివరాలు వినియోగదారులు తెలుసుకోవచ్చని తుమ్మల స్పష్టం చేశారు. దీని వల్ల ఆర్గానిక్ పంటలు పండించే రైతులకు ఉపయోగం జరగనుంది. అలాగే వినియోగదారులు కూడా నకిలీ ఉత్పత్తులు కాకుండా మెరుగైన ఉత్పత్తులు కొనుగోలు చేయగలుగుతున్నారు. ప్రస్తుతం యాప్ సిద్దమవుతుందని, త్వరలోనే లాంచ్ అవుతుందని పేర్కొన్నారు.