Kishan Reddy: “ఆర్థిక వనరుల సమీకరణ కోసం పర్యావరణాన్ని నాశనం చేయడం భావ్యం కాదు”

HCU సమీపాన ఉన్న భూముల వేలం ఇప్పుడు తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారింది. భూముల వేలాన్ని ఉపసహంహరించుకోవాలని డిమాండ్ చేస్తోంది బీజేపీ. ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భూమల వేలాన్ని ఆపాలని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. తాజాగా మరోసారి ఎక్స్ వేదికగా స్పందిచారు. ఆర్థిక వనరుల సమీకరణ పేరిట ప్రభుత్వ భూమి వేలం ప్రక్రియను ఉపసంహరించుకోవాలని హితవు పలికారు.

Kishan Reddy:  ఆర్థిక వనరుల సమీకరణ కోసం పర్యావరణాన్ని నాశనం చేయడం భావ్యం కాదు
Union Coal Minister G Kishan Reddy

Updated on: Mar 31, 2025 | 9:48 PM

హైదరాబాద్‌ కంచా గ్రామం, గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములు వేలం వేయాలని రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయించడంపై కేంద్ర బోగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్లక్ష్య చర్యను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. పర్యావరణ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని రేవంత్ ప్రభుత్వానికి ఆయన సూచించారు. హైదరాబాద్ పర్యావరణానికి ఎంతో తోడ్పాటును అందిస్తున్న ఈ ప్రదేశాలను రక్షించాలని సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ 400 ఎకరాల భూమిని వేలం వేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదని ఆయన తన అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు. జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు. నిధుల సమీకరణ కోసం ఈ తరహా చర్యలు చేపట్టడం ఏంటని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయం అమలు అయితే గొప్ప వృక్షజాలంతోపాటు జంతుజాలం తుడిచిపెట్టుకు పోవడం ఖాయమన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం..విద్యార్థులను అణచివేయడం.. చెట్లను నరికివేయడంతోపాటు పచ్చదనం, జీవవైవిధ్యాన్ని నాశనం చేయడం దారుణమని ఆయన పేర్కొన్నారు.  ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయని పేర్కొన్నారు.

ఈ ప్రాంత జీవవైవిధ్యాన్ని నాశనం చేస్తున్నప్పుడు.. జాతీయ పక్షులైన నెమళ్ల వేస్తోన్న కేకలు వినడం హృదయ విదారకంగా ఉందన్నారు. హెచ్.సీ.యూ వంటి ఎంతో పేరున్న విద్యా సంస్థలను ఆక్రమించుకోవాలనే ఆలోచనను కిషన్ రెడ్డి ఖండించారు. విద్యార్థుల గొంతులను నొక్కడం భావ్యం కాదన్నారు. ఇప్పటికే ఇదే అంశంపై సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కొద్దిరోజలు క్రితం లేఖ రాశారు. 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని ఆ లేఖ కిషన్ రెడ్డి డిమాండ్‌ చేశారు.

HCUకి సమీపాన ఉన్న భూముల వేలాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు, విద్యార్థి సంఘాలు కొద్దిరోజులుగా పెద్దయెత్తున ఆందోళన చేస్తున్నాయి. ఈ క్రమంలోనే.. భూమిని చదును చేసేందుకు ప్రయత్నిస్తున్న జేసీబీలను విద్యార్థులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే నిరాహారదీక్ష చేస్తామని స్టూడెంట్స్ హెచ్చరిస్తున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి