ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ఇప్పటికే బీఆర్‌ఎస్ అభ్యర్థులను ప్రకటించేసి ప్రచారం కూడా మొదలుపెట్టింది. కానీ, ప్రత్యా్మ్నాయం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది? ఇప్పటికే వారం అయిపోయింది. ఆశావహుల నుంచి అప్లికేషన్లు తీసుకుని ఏం చేయాలో పీసీసీకి.. పీఈసీకి తెలియడంలేదు. దీనికి కారణం ఒక్కో ఫ్యామిలీ నుంచి రెండు మూడు టికెట్లను ఆశిస్తున్నారు నేతలు. బలమైన నేతలు, కుటుంబాలు కావడంతో.. టికెట్ల కేటాయింపు కోసం తీవ్రంగా లాబీయింగ్ చేస్తున్నారు. ఈ వాదాన్ని కార్నర్ చేసేందుకు రేవంత్ రెడ్డి వంటి నేతలు ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను తెరపైకి తీసుకొస్తున్నారు. పాత, కొత్త నాయకులు ఫ్యామిలీ మెంబర్స్ కు కూడా టికెట్లు అడుగుతున్నారు. అలా టికెట్లు ఆశిస్తున్న వారిలో మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి ఉన్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 2022 మేలో జరిగిన సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం పార్టీలో 5 ఏండ్ల కన్నా తక్కువ అనుభవం ఉన్న వారి ఫ్యామిలీలో ఒక్కరికే టికెట్ కేటాయించాలి. ఒక్కో ఫ్యామిలీకి రెండేసి టికెట్లు కేటాయించడం వల్ల ఆ సెగ్మెంట్‌లో తాము అవకాశాలు కోల్పోతున్నామని మిగతా నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్తగా పార్టీలో చేరుతున్న నేతలు కూడా ఫ్యామిలీ ప్యాక్ అడుగుతుండటం న్యూసెన్స్ క్రియేట్ చేస్తోంది. దీంతో ఆయా సెగ్మెంట్లలో టికెట్ల కేటాయింపు అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఇవ్వకుంటే పార్టీకి నష్టం జరుగుతుందనే భయం వెంటాడుతోంది. రెండేసి.. మూడేసి టికెట్లు ఆశిస్తున్న వారిలో.. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్యభర్తలకు, జానారెడ్డి తండ్రీ కొడుకులు, దామోదర రాజనర్సింహా తండ్రీ కూతుళ్లు, బలరాం నాయక్ తండ్రీ కొడుకు, సీతక్క తల్లీ కూతుళ్లకు, కొండా సురేఖ భార్యభర్తలకు, అంజన్ కుమార్ యాదవ్ తోపాటు తన ఇద్దరు కొడుకులకు, రేఖా నాయక్ భార్యాభర్తలకు, మైనంపల్లి హన్మంతరావు తండ్రీ కొడుకులకు టికెట్లు అడుగుతున్నారు.
2022 – ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఇందులో ఉత్తమ్, కొండా కుటుంబాలకు తప్ప ఇంకెవరికీ రెండో టికెట్ వచ్చే పరిస్థితి లేదు. ఉత్తమ్ భార్య పద్మావతి గతంలో కోదాడ ఎమ్మెల్యేగా చేశారు. 2018 ఎన్నికల్లోనూ గట్టి పోటీ ఇచ్చారు. ఈసారి గెలుస్తామన్న ధీమాతో ఉన్నారు. కొండా సురేఖ దంపతులు ఇద్దరూ ఐదేళ్లకు పైబడి కాంగ్రెస్‌లో కొనసాగుతూ వస్తున్నారు. కానీ రేఖానాయక్, మైనంపల్లి వంటి జంపింగ్ నేతలు రెండేసి టికెట్లు ఆశిస్తుండడంతో వారికి ఇవ్వాళా లేదా అని పీఈసీ మంతనాలు జరుపుతోంది. ఇలాంటి వారిని లిస్ట్ ఔట్ చేసి.. ఢిల్లీకి పంపేందుకు రెడీ అవుతోంది ప్రదేశ్ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ. అక్కడ స్క్రీనింగ్ తర్వాత ఫైనల్ లిస్టు రానుంది. టికెట్ల కేటాయింపులో ఉదయ్‌పూర్ డిక్లరేషన్‌ను పరిగణలోకి తీసుకుంటామంటున్నారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి.
ఇక ఒక పార్లమెంటు పరిధిలో ఇద్దరు బీసీలకు టికెట్ ఇవ్వాలన్న నిబంధన ఉంది. నల్గొండ పరిధిలో బీసీలకు చాన్స్ ఇచ్చేందుకు తన సీటునైనా వదులుకుంటానంటున్నారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. కానీ.. ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు తీసేస్తే.. మరో టికెట్ ఎక్కడి నుంచి ఇస్తారన్నదే ఆసక్తికరంగా మారింది. ఇక్కడ కూడా కోమటిరెడ్డి మెలిక పెట్టారు. అన్ని పార్లమెంటు సెగ్మెంట్స్‌లో ఆ విధంగా టికెట్లు కేటాయిస్తేనే.. తాను త్యాగం చేస్తానంటున్నారు. ఇలా నేతల డిమాండ్లు, అభ్యర్థనలు, అలకలు, బెదిరింపులతో కాంగ్రెస్ పునర్వైభవాన్ని సంతరించుకున్నట్లు కనిపిస్తోంది. ఫైనల్ లిస్టు వచ్చేదాక అధిష్టానానికి ఈ తంటాలు తప్పేలా లేవు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..