Viral: మద్యం షాప్ వెలుపల స్కూల్ డ్రెస్‌లో ఇద్దరమ్మాయిలు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది

ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్కూల్ యూనిఫాంలో ఉన్న కొందరు విద్యార్ధినిలు ఓ మద్యం షాప్ దగ్గర లిక్కర్ కొనుగోలు చేస్తున్నట్టు మీరు అందులో చూడవచ్చు. ఇంతకీ ఈ ఘటన ఎక్కడ జరిగిందో.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Viral: మద్యం షాప్ వెలుపల స్కూల్ డ్రెస్‌లో ఇద్దరమ్మాయిలు.. కట్ చేస్తే.. ఆ తర్వాత సీన్ ఇది
Representative Image

Edited By: Ravi Kiran

Updated on: Oct 27, 2025 | 8:27 AM

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మండ్లా జిల్లా నైన్పూర్ పట్టణంలో జరిగిన ఒక ఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న కొంతమంది చిన్నారులు మద్యం దుకాణం వద్దకు వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ సంఘటన ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ, అలాగే సమాజపు బాధ్యతలపై పెద్ద ప్రశ్నలను లేవనెత్తుతోంది.

వీడియో ప్రకారం.. స్కూల్ యూనిఫామ్‌లో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు బాలికలు మద్యం దుకాణం వద్దకు వచ్చి అక్కడి విక్రేత నుంచి మద్యం తీసుకుంటారు. ఆ బాటిల్‌ను తమ స్కూల్ బ్యాగ్‌లో వేసుకుని పెద్దగా ఎలాంటి భయం లేకుండా అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఈ దృశ్యాలను అక్కడే ఉన్న కొంతమంది వ్యక్తులు తమ మొబైళ్లలో రికార్డ్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ కావడంతో అది వేగంగా వైరల్ అయింది. ఈ వీడియో బయటకు రాగానే జిల్లా పరిపాలన కదిలింది. జిల్లా కలెక్టర్, అబ్కారీ శాఖ అధికారులు తక్షణమే దుకాణానికి వెళ్లి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. విచారణలో ఆ బాలికలు నిజంగానే మద్యం తీసుకున్నట్లు తేలింది. దీంతో జిల్లా అబ్కారీ అధికారి రామ్‌జీ పాండే ఆ మద్యం దుకాణంపై రెండు లక్షల రూపాయల జరిమానా విధించారు. అదేవిధంగా, దుకాణం బయట ‘బాలికులకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం’ అనే హెచ్చరిక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు.

అయితే ఈ ఘటన ఇప్పుడు రాజకీయ రంగు కూడా సంతరించుకుంది. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ అశోక్ మర్స్కోలే రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో మద్యం విక్రయాలపై ఎలాంటి నియంత్రణ లేదని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని’ పేర్కొన్నారు. స్థానిక ప్రజలు, సామాజిక కార్యకర్తలు కూడా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి అభిప్రాయం ప్రకారం.. మద్యం దుకాణం పట్టణం మధ్యలో ఉండడం వల్ల యువత, విద్యార్థులపై ప్రతికూల ప్రభావం పడుతోంది. వారు ఆ దుకాణాన్ని పూర్తిగా మూసివేయాలని లేదా కనీసం పట్టణం వెలుపలికి తరలించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఘటన ఒక చిన్న తప్పిదం కాదని, ఇది సమాజంలో పెరుగుతున్న నిర్లక్ష్యం, మానవ విలువల పతనానికి సంకేతమని అనేక మంది అంటున్నారు.