Telangana: సమ్మెకు దిగుతున్న ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వానికి హెచ్చరిక..

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. తమ డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సమ్మెకు రెడీ అయ్యారు. ఇవాళ లేబర్ కమిషనర్‌తో జేఏసీ ప్రతినిధులు భేటీ అవుతున్నారు. సాయంత్రం ఈ భేటీ జరగనుండగా.. అనంతరం అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది.

Telangana: సమ్మెకు దిగుతున్న ఆర్టీసీ కార్మికులు.. ప్రభుత్వానికి హెచ్చరిక..
Tsrtc

Updated on: Apr 13, 2026 | 12:16 PM

తెలంగాణలోని ఆర్టీసీ కార్మికులు సమ్మె హెచ్చరిక జారీ చేశారు. ఈ నెల 20వ తేదీ నుంచి సమ్మెకు దిగుతున్నట్లు హెచ్చరించారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు లేబర్ కమిషనర్‌తో ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు భేటీ అవుతున్నారు. సమ్మె, తమ డిమాండ్లపై అధికారులతో చర్చలు జరపనున్నారు. అధికారుల నుంచి వచ్చే స్పందనను బట్టి సమ్మెపై అధికారిక ప్రకటన చేయనున్నట్లు ఆర్టీసీ జేఏసీ ప్రతినిధులు తెలిపారు. అయితే లేబర్ ఆఫీస్ వద్దకు కార్మికులందరూ చేరుకోవాలని ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. తమ డిమాండ్లపై గళమెత్తాలని కార్మికులకు సూచించింది. కార్మికులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చింది.

కార్మికుల డిమాండ్లు ఇవే..

వేతనాలు, బెనిఫిట్స్, సర్వీస్ సమస్యలపై గత కొంతకాలంగా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. దీంతో ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు సమ్మె చేపట్టేందుకు సిద్దమవుతున్నారు. ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని కోరుతున్నారు. మార్చి 13న ఆర్టీసీ కార్మికులు సమ్మె నోటీసులు ఇవ్వగా.. ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో మరోసారి సమ్మె నోటీసు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారు. ఈ సారి ప్రభుత్వం నుంచి స్పందన రాకపోతే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. తాము సమ్మెకు దిగితే దాని బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలని సూచించారు. తమ డిమాండ్లపై వెనక్కి తగ్గేది లేదని, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేస్తామని జేఏసీ తెలిపింది.

ప్రజలకు ఇబ్బందులే

ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగితే ఆర్టీసీ సేవలు నిలిచిపోయే అవకాశముంది. దీని వల్ల ప్రజా రవాణా స్తంభించిపోయే ప్రమాదముంది. లక్షలాది మంది ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బంది పడే అవకాశముంది. దీంతో కార్మిక సంఘాల నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆర్టీసీ జేఏసీ సమ్మె హెచ్చరికపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది చర్చనీయాంశంగా మారింది.

Follow Us