
నిరుద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూ్స్ తెలిపింది. ఆర్టీసీలో తాత్కాలిక ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డ్రైవర్లు, కండక్టర్ల పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు గత రెండు రోజులుగా సమ్మె చేపడుతున్నారు. ఆర్టీసీ బస్సులను డిపోల్లోనే వదిలేసి ఆందోళనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రజా రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతోంది. దీంతో ఆర్టీసీ సేవలు నిలిచిపోగా.. ప్రజలకు సర్వీసులు అందించేందుకు తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు ఆర్టీసీ సిద్దమైంది. ఈ తాత్కాలిక ఉద్యోగులతో ఆర్టీసీ సర్వీసులను నడపనుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. అద్దె బస్సులను పలు ప్రాంతాల్లో తిప్పుతోంది. అలాగే ప్రైవేట్ డ్రైవర్లను నియమించుకుంటోంది.
తెలంగాణ ప్రభుత్వం అన్ని డిపోల పరిధిలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకునేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూచిస్తోంది. ఆయా డిపోల ఫోన్ నెంబర్లకు కాల్ చేస్తే దరఖాస్తు వివరాలు చెబుతారని టీజీఎస్ఆర్టీసీ చెబుతోంది. అన్ని జిల్లాల పరిధిలో తాత్కాలిక డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుంటున్నారు. ప్రస్తుతం నియామక ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే వేసవి కావడంతో బస్సుల్లో రద్దీ పెరిగింది. దీనికి తోడు బస్సులు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో తాత్కాలికంగా డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుని ఎలాగైనా ప్రజలకు ఇబ్బంది కలగకుండా బస్సులను తిప్పాలని టీజీఎస్‌ఆర్టీసీ భావిస్తోంది. అర్హత కలిగిన వారు డిపోల మేనేజర్లను సంప్రదించి దరఖాస్తులు చేసుకోవాలని, అర్హత ఉంటే వెంటనే తీసుకుంటారని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ డ్రైవర్లతో కొన్నిచోట్ల బస్సులు తిప్పుతున్నారు. ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ తిప్పుతోంది.
హైదరాదాద్ విషయానికొస్తే.. బస్సులు ఆగిపోవడం వల్ల నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆఫీసులకు వెళ్లేవారు, కూలీ పనులకు వెళ్లేవారు అవస్థలు పడుతున్నారు. ఆటోలు, క్యాబ్‌లను ఆశ్రయిస్తుండగా.. వాటిల్లో ఛార్జీలు భారీగా వసూలు చేస్తున్నారు. దీంతో సామాన్యులకు భారంగా మారుతోంది. ఈ క్రమంలో కూకట్ పల్లి, ఉప్పల్, మేడ్చల్, జీడిమెట్ల, మియాపూర్, రాణిగంజ్, కుషాయిగూడ, కంటోన్మెంట్, హెచ్‌సీయూ డిపోల పరిధిలో తాత్కాలిక ఉద్యోగులను నియమించుకుంటున్నారు. అర్హులైనవారు డిపోలల్లో సంప్రదించాలని కోరుతున్నారు.