TSRTC Offer: ప్రాణహిత పుష్కరాలకు వెళ్తున్నారా ? అయితే మీ ఇంటి దగ్గరకే బస్సు వస్తుంది. అయితే దీనికి కొన్ని షరతులున్నాయి. అవి ఏమిటో ఒకసారి తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి ప్రాణహిత పుష్కరాలను నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. భక్తుల కోసం అన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఆర్టీసీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఈనెల 13వ తేదీ నుంచి మొదలైన ప్రాణహిత పుష్కరాలు 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. తాజాగా ప్రాణహిత పుష్కరాలకు వెళ్లే భక్తుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది తెలంగాణ ఆర్టీసీ. భక్తులను పుష్కరఘాట్లకు చేర్చేందుకు 200 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల నుంచి 200 స్పెషల్ బస్సులను నడపుతోంది. అయితే, 30 మంది భక్తులు ఉంటే ఇంటికే బస్సులను పంపిస్తామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీంతో ఒక కాలనీ నుంచి లేదా ఒక ఏరియా నుంచి ఒకేసారి 30 మంది భక్తులు వెళ్తే వారి దగ్గరికే ఆర్టీసీ బస్సు రానుంది. ఇంటి దగ్గరి నుంచి నేరుగా పుష్కర ఘాట్ వరకు తీసుకెళ్తారు.
మరోవైపు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని అర్జునగుట్ట దగ్గర ప్రారంభమైన ప్రాణహిత పుష్కరాల్లో ప్రత్యేక పూజలుచేసి, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు రామగుండం పోలీస్ కమీషనర్ చంద్రశేఖర్ రెడ్డి. పుష్కర ఘాట్ల దగ్గర పటిష్ట భద్రతా బందోబస్తు ఏర్పాట్లు చేశామని చెప్పారు. అర్జున గుట్ట దగ్గర భద్రతా ఏర్పాట్లతో పాటు, పుష్కర ఘాట్లు, పార్కింగ్ స్థలాలు, చెక్ పోస్టులను ఆయన తనిఖీ చేశారు. ప్రాణహిత పుష్కరాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 300 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు పోలీసుల సూచనలు తప్పక పాటించాలని, నది స్నానం చేసేటప్పుడు జాగ్రత్త వహించాలని సూచించారు. పుష్కరాల సమయంలో భక్తులతో పోలీసు అధికారులు,సిబ్బంది మర్యాదగా వ్యవహరించాలని, క్రమశిక్షణ ఓపికతో ప్రవర్తించి, పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలని ఆయన పోలీసు సిబ్బందికి సూచించారు.
Also read: