ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ(Rahul Gandhi) తెలంగాణ పర్యటన తేదీలు ఖరారయ్యాయి. మే 4, 5 తేదీల మధ్య రెండు రోజులపాటు ఆయన తెలంగాణలో పర్యటించేందుకు ఏఐసీసీ కార్యాలయ వర్గాల నుంచి ఆమోదం లభించింది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం మే 4న వరంగల్ బహిరంగ సభలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వహించే ‘రైతు బహిరంగసభ’కు ఆయన ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సభ తర్వాతి రోజున రాహుల్‌గాంధీ ఒకరోజు హైదరాబాద్‌లో ఉండనున్నారు. మే 5న బోయినపల్లిలో కార్యకర్తలతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. ఆ తర్వాత గాంధీభవన్‌లో రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యనేతలతో రాహుల్ సమావేశం ఉండే ఛాన్స్ ఉందని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో కూడా సమావేశమై వారికి దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు చెపుతున్నాయి.
డీసీసీల అధ్యక్షులు, డిజిటల్ సభ్యత్వ నమోదులో క్రియాశీలంగా పనిచేసిన ఎన్‌రోలర్స్‌కు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించనున్నారు. పార్టీ తరఫున స్థానిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలతో కూడా రాహుల్‌గాంధీ సమావేశమయ్యేలా టీపీసీసీ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. తద్వారా పార్టీలోని అన్నిస్థాయిల నేతలతో రాహుల్‌తో పరిచయం చేయాలని ఆలోచిస్తోంది. ఇదే స్ఫూర్తితో పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలోకి దిగేందుకు ఉద్యుక్తులమవుతామని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
గత సోమవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రాష్ట్రనేతలు రాహుల్‌ను తెలంగాణకు ఆహ్వానించారు. ఈ నెల 25–30 వరకు ఒకటి లేదా రెండు రోజులపాటు రాష్ట్రానికి రావాలని ఆయన్ను కోరినట్లుగా.. మే 4, 5 తేదీల్లో తెలంగాణలో పర్యటించేందుకు అంగీకరించినట్లుగా వెల్లడైంది.
ఇవి కూడా చదవండి: Watch Video: వీహెచ్ కారు అద్దాలు ధ్వంసం చేసింది ఇతనే.. సీసీటీవీలో రికార్డ్ ..
Bandi Sanjay: ఇవాళ్టి నుంచి ప్రజా సంగ్రామం.. అలంపూర్ నుంచి బండి సంజయ్ పాదయాత్ర..