Telangana: బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు, టీఆర్ఎస్ నేత వినోద్ కుమార్. మతం పేరుతో రాజకీయాలు చేయడం కాదు.. అభివృద్ధి పేరుతో రాజకీయాలు చేయాలంటూ సవాల్ విసిరారు. ఆదివారం నాడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్ నగర్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో మాట్లాడారు వినోద్ కుమార్. మైనార్టీలు అందరూ మన వాళ్లే అన్న ఆయన.. మతం అనేది వ్యక్తిగతం అని పేర్కొన్నారు. దేశంలో ఎవరి మతం వారిది అని, ఎవరి విశ్వాసం వారిది అని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు అభివృద్ధి కోసం పాటుపడాలని, రెచ్చగొట్టడం కోసం కాదంటూ బీజేపీ టార్గెట్‌గా ఘాటైన విమర్శలు చేశారు. ‘మన పిల్లల భవిష్యత్ బాగుండాలని అన్ని వర్గాల వారి క్షేమం కోసం సీఎం కేసీఆర్ అనేక పథకాలు చేపట్టారు’ అని అన్నారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి ఉందా? చర్చకు సిద్ధమా? అని బీజేపీ ఎంపీలు, మంత్రులకు సవాల్ విసిరారు వినోద్ కుమార్. దేశంలో నిజమైన దేశ భక్తులు ఎవరంటే.. ఇక్కడి పిల్లల భవిష్యత్ గురించి ఆలోచించే వారే అని, అది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం పుట్టిన పార్టీ టీఆర్ఎస్ అని అన్నారు. అవినీతిని అంతం చేస్తానన్న మోదీ.. ఎనిమిదేళ్లలో ఒక్క కార్యక్రమం అయినా ప్రజల కోసం చేశారా? అని ప్రశ్నించారు వినోద్ కుమార్. ధనికుల కోసమే బీజేపీ సర్కార్ పని చేస్తుందని విమర్శించారు. అన్నీ ప్రైవేటీకరించి.. అంబానీ, అదానీల ఇళ్లు డబ్బుతో నింపుతున్నావంటూ ప్రధాని మోదీపై తీవ్ర ఆరోపణలు చేశారు. మోదీ ప్రభుత్వం.. ప్రజల నుంచి దూరమైందని, తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని అన్నారు.