Telangana: గజ్వేల్‌లో పోటీ చేస్తానంటూ బీజేపీ నాయకుడు ఈటెల రాజేందర్ చేసిన ప్రకటనపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ముందు హుజూరాబాద్‌లో గెలిచి చూడు అంటూ ఎదరు సవాళ్లు విసురుతున్నారు. ఇదే అంశంపై గజ్వేల్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎఫ్‌డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈటెలపై ఓ రేంజ్‌లో విమర్శలు గుప్పించారు. ఈటెల రాజేందర్ గజ్వేల్‌లో కాదు.. మరోసారి హుజూరాబాద్‌లో గెలిచి నీ ఉనికిని చాటుకో అంటూ కౌంటర్ ఇచ్చారు. ‘‘గజ్వేల్‌లో నీవు కాదు ప్రధాని నరేంద్ర మోడీ, మీ నాయకుడు అమిత్ షా, నడ్డా వచ్చినా వారికి ఇక్కడ ఓటమి తప్పదు.’’ అని అన్నారు. గజ్వేల్ ప్రజలు చైతన్యం కలిగిన వారని, అభివృద్ధి చేసే కేసీఆర్ వెంటే ఇక్కడి ప్రజలు ఉంటారని అన్నారు. టీఆర్ఎస్ కండువా వేసుకున్న ఒక సామాన్య కార్యకర్తను కూడా ఈటెల రాజేందర్ ఓడించ లేడని వ్యాఖ్యానించారు. ఆస్తులను కాపాడుకునేందుకే ఈటెల రాజేందర్ బీజేపీ కండువా వేసుకున్నారని దుయ్యబట్టారు. హుజూరాబాద్ నియోజకవర్గానికి కేంద్రం నుండి తీసుకొచ్చిన నిధుల వివరాలు చెప్పగలవా? అని ఈటెలను ప్రశ్నించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం కేసీఆర్ చేసిన అభివృద్ధి తప్ప నువ్వు చేసిందేమీ లేదంటూ ఈటలపై ఫైర్ అయ్యారు ప్రతాప్ రెడ్డి. హుజూరబాద్‌లో ఓడిపోతానని గ్రహించే.. గజ్వేల్‌లో పోటీ అంటూ డ్రామాలు ఆడుతున్నాడని ఈటల రాజేందర్‌పై విమర్శలు గుప్పించారు ప్రతాప్ రెడ్డి.