
తెలంగాణలోని మునుగోడు ఉప ఎన్నికను మూడు ప్రధాన పార్టీలైన టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. గెలుపే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అభ్యర్థితో పాటు పార్టీకి చెందిన రాష్ట్ర నాయకులు మొదలు గ్రామ స్థాయి నాయకుల వరకు అంతా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమైపోయారు. వెళ్లిన గ్రామానికే వెళ్తూ.. ప్రతి ఓటరును ఏదో రకంగా కలిసి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ ఎస్ కు చెందిన గ్రామ సర్పంచ్ మొదలు మంత్రులు, ఎమ్మెల్యేల వరకు అంతా మునుగోడులో మకాం వేశారు. ప్రధానంగా టీఆర్ ఎస్, బీజేపీ నాయకుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కేంద్రప్రభుత్వంపై టీఆర్ ఎస్ నాయకులు విమర్శలు చేస్తుంటే.. అదే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ నాయకులు కౌంటర్ ఎటాక్ చేస్తున్నారు. మధ్యలో నేనున్నానంటూ కాంగ్రెస్ టీఆర్ ఎస్, బీజేపీలపై విమర్శలు చేస్తున్నప్పటికి, ముఖ్యంగా మునుగోడు ఫైట్ బీజేపీ వర్సెస్ టీఆర్ ఎస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. కానీ క్షేత్రస్థాయిలో తమకున్న బలాన్ని కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధులు కొంతమంది టీఆర్ ఎస్, బీజేపీలో చేరడంతో కాంగ్రెస్ పరిస్థితి అంత ఆశాజనకంగా కనిపించడంలేదనేది రాజకీయ విశ్లేషకుల మాట.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భంగా టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా సంస్థాన్ నారాయణపురంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. కాంట్రాక్టుల కోసం పార్టీ మారిన బిజెపి అభ్యర్థి మనకెందుకన్నారు. సంస్తాన్ నారాయణపురం ఎంపీటీసీ టు స్థానంలో మంత్రి గంగుల కమలాకర్ ఇంటింటి ప్రచారం పాల్గొని తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ఎందుకు కారు గుర్తుకు ఓటెయ్యాలో సవివరంగా వివరించారు. ఒక పార్టీ నుండి గెలిచి కాంట్రాక్టుల కోసం, సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారిన వ్యక్తి మనకు అవసరమా అని ప్రశ్నించారు, కాంగ్రెస్ కు ఓటేసినా… వాళ్లు బిజెపిలోకి వెళ్తారని, పరోక్షంగా బిజెపికి మద్దతు ఇచ్చినట్లేనని స్పష్టంగా తెలియజేశారు. ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్, ఈద్ తోఫా ఇతరత్రా సంక్షేమ కార్యక్రమాల్ని మంత్రి వివరించారు. ఈ ప్రచారంలో సంస్థాన్ నారాయణపూర్ కు చెందిన టీఆర్ ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇప్పటికే మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల పర్వం ముగిసింది. నామపత్రాల ఉపసంహరణకు అక్టోబర్ 17వ తేదీ సోమవారం వరకు అవకాశం ఉంది. నవంబర్ 3వ తేదీన పోలింగ్ జరగనుండగా, 6వ తేదీన ఓట్లు లెక్కించి, ఫలితాలు వెల్లడిస్తారు. మునుగోడులో గెలుపుపై టీఆర్ ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..