
పండుగ అంటేనే సంతోషం, కుటుంబ సభ్యులందరితో కలిసి విందు భోజనాలు. కానీ మహబూబాబాద్ జిల్లాలోని ఒక కుటుంబంలో ఆ సంతోషం కాస్తా తీరని వేదనను మిగిల్చింది. భోజనం చేస్తున్న సమయంలో జరిగిన ఒక చిన్న ప్రమాదం ఒక రైతు ప్రాణాన్ని బలితీసుకుంది. గూడూరు మండలం దామరవంచ శివారులోని పిల్లగుండ్లతండాకు చెందిన బానోత్ బిచ్చ (54) వృత్తిరీత్యా రైతు. ఆయన తన కుటుంబంతో కలిసి ఇంట్లో దుర్గమ్మ పండుగను ఘనంగా జరుపుకున్నారు. పండుగ వాతావరణంలో కుటుంబ సభ్యులందరూ కలిసి కూర్చుని సరదాగా ముచ్చటించుకుంటూ భోజనాలు చేస్తున్నారు.
అన్నంతో పాటు మటన్ ముక్కను తింటున్న క్రమంలో అది అనుకోకుండా బిచ్చ గొంతులో ఇరుక్కుపోయింది. దానిని మింగలేక, బయటకు తీయలేక ఆయన తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. ఒక్కసారిగా ఊపిరి ఆడకపోవడంతో బిచ్చ అస్వస్థతకు గురై కిందపడిపోయారు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రాథమికంగా సహాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది.
పరిస్థితి విషమించడంతో వెంటనే ఆయనను గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే దురదృష్టవశాత్తు, ఆసుపత్రికి చేరేలోపే బిచ్చ ప్రాణాలు విడిచారు. పరీక్షించిన వైద్యులు ఆయన అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. పండుగ పూట ఇంటి యజమాని మరణించడంతో భార్యాపిల్లలు బోరున విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి తండావాసులు కన్నీరుమున్నీరవుతున్నారు. మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..