
హైదరాబాద్ టోలిచౌకి పోలీసులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్నారు. నలుగురు యువకులు రాత్రి పూట ఎలాంటి కారణం లేకుండా రోడ్డు మీద తిరుగుతున్నారని.. వారిని అదుపులోకి తీసుకోవడమే అందుకు కారణం. నవంబర్ 18 అర్ధరాత్రి ప్రాంతంలో తిరుగుతున్న ఆ నలుగురిపై చిన్న కేసులు నమోదు చేశారు. ఆపై కోర్టులో హాజరుపరచగా ప్రత్యేక న్యాయస్థానం వారిని 3–7 రోజుల జ్యూడిషియల్ రిమాండ్‌కు పంపింది. ఈ సమాచారాన్ని పోలీస్‌స్టేషన్ అధికారిక ఎక్స్ హ్యాండిల్ ద్వారా వెల్లడించడంతో వివాదం మరింత వేడెక్కింది. పోలీసుల పోస్టు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. రాత్రివేళ బయట తిరిగినంత మాత్రాన కేసులు ఎలా పెడతారని నెటిజన్లు ప్రశ్నించారు. రోడ్లపై తిరగడానికి ప్రత్యేక కారణం చెప్పాల్సిన అవసరం ఏమిటని, అలాంటి నిబంధన ఏ చట్టంలో ఉందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.
వివాదం పెరుగుతున్న నేపథ్యంలో టోలిచౌకి పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఈ యువకులు సాధారణ పౌరులు కాదని, ఇంతకుముందే పలు కేసుల్లో నిందితులుగా ఉన్నారని పేర్కొన్నారు. వారి పేర్లతో సస్పెక్ట్ షీట్ ఉందని చెప్పారు. పలు మార్లు కౌన్సెలింగ్ చేసినప్పటికీ వారు అదే తరహా ప్రవర్తన కొనసాగించారని పోలీసుల వివరణ ఇచ్చారు. ప్రజల భద్రత, నేరాల నియంత్రణ కోసం చర్యలు తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. ఫస్ట్ ఇంత క్లారిటీ లేకుండా పోస్ట్ వేయడంతో దుమారం చెలరేగింది. లా అండ్ ఆర్డర్ కాపాడాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని.. వారు తీసుకున్న చర్యలు కరెక్టే కొందరంటున్నారు. ఏదైనా జరిగినా తర్వాత పోలీసులు పెట్రోలింగ్ సరిగ్గా లేదని కామెంట్స్ చేస్తారు. ఇలా అనుమానితులను అదుపులోకి తీసుకుంటే ఈ విధంగా రచ్చ చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు అన్నది కొందరి భావన. ఏది ఏమైనా ఒక్క పోస్టులో టోలిచౌకి పోలీసులు నెట్టింట ట్రెండ్ అయ్యారు.
Four persons were found roaming in the Tolichowki Police Station limits at midnight without any valid reason, booked a petty cases and have been remanded to judicial custody from three to seven days by the Hon’ble XII Special Court, Manoranjini Complex. pic.twitter.com/P0QD98n391
— SHO TOLICHOWKI (@ShoTolichowki) November 18, 2025