
వీధి కుక్కల సంచారంతో జనం బెంబేలెత్తుతున్నారు. కుక్కల బెడదను తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కుక్కల బెడదను నివారించాలని సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా పాలకులకు పట్టడం లేదు. వీధి కుక్కల బెడద నివారణకు ఇక్కడ స్థానికులు వినూత్నప్రయోగం చేశారు. ఆ వినూత్న ప్రయోగం ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా రాత్రి, పగలు బైకులపై, సైకిళ్లపై వెళ్లే వారితోపాటు పాదచారులనూ వీధి కుక్కలు వదలడంలేదు. పిల్లలపై దాడులు మరింత అధికమయ్యాయి. దీంతో మహిళలు పిల్లలు ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకు తున్నారు. వీధి కుక్కల బెడద నివారణకు ఏం చేయాలో జనానికి అర్థం కావడం లేదు. వీధి కుక్కల బెడద నివారణకు జనం ప్రత్యాన్మయం ఆలోచించారు. యాదాద్రి జిల్లా కేంద్రం భువనగిరి పట్టణ వీధుల్లో ఇళ్ల ముందు రంగునీళ్లు నింపిన బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. సాధారణంగా గ్రామాలు, పల్లెల్లో వాహనదారులకు అవసరమైన పెట్రోల్, డీజిల్ దొరికే దుకాణాల ఎదుట ఆయిల్ నింపిన బాటిళ్లను సింబల్ గా కడుతుంటారు. ఇవి పల్లెల్లో కనిపించే పెట్రోల్ బాటిళ్ల అనుకుంటే పొరపాటే. ఒక ఇంటి ముందు సున్నం, పసుపు కలిపిన ఎరుపు రంగును చూసి కుక్కలు ఆ ఇంటి వైపు రావడానికి భయపడ్డాయి. రంగుల నీళ్లతో కూడిన వాటర్ బాటిళ్లను ఇంటి ముందు తగిలించి కుక్కలను భయపెట్టడం ద్వారా వాటిని నివారించగలిగారు. ఇదేదో బాగుందని ఆ వీధిలోని వారంతా తమ ఇళ్ల ముందు. పూడ్ కలర్.. కేసర్ రంగు నింపిన బాటిళ్లను వేలాడదీశారు. ఈ ఐడియా బాగుందని భువనగిరి పట్టణంలోని జనం తమ ఇంటి ముదు కూడా ఎరుపు రంగు బాటిల్స్ ను కట్టుకున్నారు. ఈ పద్ధతి విజయవంతం కావడంతో కుక్కల బెడద నుంచి ఉపశమనం పొందుతున్నామని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.