కొమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగాం అటవీ ప్రాంతంలో డిసెంబర్ 27 న పశువుపై పులి దాడి చేసింది. పశువు మాంసం తినేందుకు ఎస్16 ఆడపులి వచ్చింది. ఆ తర్వాత వారం రోజులకు అది అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఆ తర్వాత అదే స్థలంలో ఎస్ 9 మగ పులి మృత్యువాత పడింది. రెండు పెద్ద పులుల మరణంతో అడవిలో అలజడి రేగింది. అయితే అవి రెండూ టెరిటోరియల్ ఫైట్‌లో చనిపోయాయంటూ అటవీ శాఖ అధికారులు కథలు చెప్పి కవర్ చేశారు.
రెండు పెద్ద పులులు చనిపోవడంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. దీంతో సెంట్రల్ టీమ్ రంగంలోకి దిగింది. వాళ్లు వచ్చి పరిశీలిస్తే పులుల మధ్య టెరిటరీ కోసం ఫైట్ జరిగినట్లు ఆధారాలు లభించలేదు. దీంతో అనుమానాలు వచ్చిన నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అధికారులు మరింత లోతుగా విచారణ చేపట్టారు. పులులు మృతి చెందిన ఘటన స్థలానికి కూత వేటు దూరంలో పశువు కళేబరాన్ని గుర్తించారు. ఎట్టకేలకు పులుల మృతిపై మిస్టరీ వీడింది. అవి విష ప్రయోగంతోనే చనిపోయాయని విచారణలో తేలింది.
పశువు మృతి చెందడం వల్లే పులులకు విష ప్రయోగం చేశారా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఆరోపణలపై జిల్లా అటవీ శాఖ స్పష్టత ఇవ్వలేదు. కాళేశ్వరం జోన్ సీసీఎఫ్ శాంతరాం, కొమురంభీం జిల్లా డీఎఫ్‌వో నీరజ్ , స్పెషల్ టీమ్ అధికారులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. తమకు మొదట టెరిటోరియల్ ఫైట్‌లో ఓ పులి చనిపోయినట్లు సమాచారం వచ్చిందని పీసీసీఎఫ్ రాకేష్ మోహన్ డోబ్రీయాల్ తెలిపారు. అయితే ఉచ్చు వల్ల కూడా ఎస్-9 పెద్ద పులి చనిపోలేదని, అది ఉచ్చులో బిగుసుకున్నాక విష ప్రయోగం జరిగినట్లు అనుమానిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. దానికి ఐదేళ్ల వయసు ఉంటుందని తెలిపారు. రెండు పులులను కూడా విష ప్రయోగంతోనే దుండగులు మట్టు పెట్టారని అధికారులు స్పష్టం చేశారు.
పెద్ద పులుల కళేబరాలకు ఎన్సీటీఏ నిబంధనల ప్రకారం పోస్ట్ మార్టం చేశారు. వాటి శరీర భాగాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపారు. పశువును తినడంతోనే పులి చనిపోయినట్టుగా ప్రాథమికంగా గుర్తించామని పీసీసీఎఫ్ అధికారులు చెబుతున్నారు. పులుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఇక విష ప్రయోగం ఎలా జరిగింది అనేది ఫోరెన్సిక్ రిపోర్ట్‌లో తేలనుందన్నారు.
కాగజ్ నగర్ డివిజన్ లో సంచరిస్తున్న నాలుగు పులుల్లో రెండు చనిపోయాయి. మరో రెండు మిస్ అయ్యాయి. విష ప్రయోగం ఘటన తర్వాత మిస్ అయిన పులులు క్షేమంగానే ఉన్నాయా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే స్థానిక అటవీ శాఖ అధికారులు విష ప్రయోగం ఘటన బయటపడకుండా గోప్యంగా ఉంచారు. దీంతో వాళ్లపై వేటు తప్పదంటున్నారు. ఇక రెండు పులుల మరణాలతో కాగజ్‌నగర్ కారిడార్ లో హై అలర్ట్ ప్రకటించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..