గుడ్‌న్యూస్‌.. టిక్కెట్‌ ధర తగ్గించిన TGSRTC.. ఈ నెల 31 వరకు..

తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ లో కీలక నిర్ణయాలు తీసుకుంది. 2027 నాటికి 2800 డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. దీంతో పాటు, డిసెంబర్ 31 వరకు T24 టికెట్ ధరలను తగ్గించింది. పెద్దలకు రూ.130, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.110, పిల్లలకు రూ.90కి ప్రయాణించవచ్చు.

గుడ్‌న్యూస్‌.. టిక్కెట్‌ ధర తగ్గించిన TGSRTC.. ఈ నెల 31 వరకు..
Tgsrtc

Updated on: Dec 13, 2025 | 10:09 PM

తెలంగాణ రాష్ట్రంలో టీజీఎస్‌ఆర్టీసీ ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తోంది. తాజాగా ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ప్రయాణికుల కోసం అందుబాటులో ఉన్న 2,800 డీజిల్ బస్సులను తొలగించాలని నిర్ణయించింది. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టనుంది. దశలవారీగా ఈ కార్యక్రమం చేపడుతుంది టీజీఎస్ఆర్టీసీ. వచ్చే రెండేళ్లల్లో అంటే.. 2027 నాటికి ఈ 2,800 డీజిల్ బస్సులన్నీ కూడా కనిపించవు. వాటి స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి.

ఈ క్రమంలో మరో ఆఫర్‌ను ప్రకటించింది టీజీఎస్ఆర్టీసీ. ట్రావెల్ యాజ్ యు లైక్ టీ24 టికెట్ల రేట్లను తగ్గించింది. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు వర్తిస్తుంది. ప్రస్తుతం టీ24 టికెట్ ధర పెద్దలకు 150 రూపాయలు, మహిళలు, సీనియర్ సిటిజన్లకు రూ.120, పిల్లలకు రూ.100 వసూలు చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఛార్జీలను తగ్గిస్తూ టీజీఎస్ఆర్టీసీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రస్తుతం తగ్గిన ధరల ప్రకారం.. పెద్దలకు రూ.130, మహిళలు- సీనియర్ సిటిజన్లకు రూ.110, పిల్లలకు రూ.90 నిర్ధారించారు. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ టికెట్లతో సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు సిటీ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. క్రిస్మస్, కొత్త సంవత్సరం పండగలు, సెలవుల సీజన్ ను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి