ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందేందుకు ముందడుగుగా భావిస్తున్న టెట్(TET) పరీక్ష రాసే అభ్యర్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. ఇప్పటికే అభ్యర్థులు ప్రిపరేషన్ మొదలుపెట్టగా.. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియా ప్రారంభమైంది. అయితే పరీక్షా కేంద్రాలు ఎన్నుకునే విషయంలో నిర్దేశించిన సంఖ్యకు మించి దరఖాస్తులు(Applications) వచ్చాయి. దీంతో చాలా మంది పక్క జిల్లాలకు వెళ్లి పరీక్ష రాయాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చి26వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించగా ఈ నెల 12తో ఆ గడువు ముగియనుంది. నెట్ సెంటర్లకు వెళ్లిన అభ్యర్థులకు ఆన్‌లైన్‌లో తమ జిల్లాల్లోని పరీక్షా కేంద్రాలు(Exam Centers) కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. తన జిల్లా పేర్లు లేకపోవడంతో పక్కనే ఉన్న జిల్లాలను ఎంపిక చేసుకోవాల్సి వస్తోంది. మీ జిల్లా కనిపించకపోతే.. ఆయా పరీక్షా కేంద్రాల కెపాసిటీ ముగిసినట్లుగా భావించి, మరో జిల్లాను కేంద్రంగా ఎంచుకోవాలని వెబ్‌సైట్లో సూచన కనిపిస్తోంది. ప్రస్తుతం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, వికారాబాద్, ములుగు, జగిత్యాల జిల్లాల పేర్లు ఆన్‌లైన్‌లో కనిపించడం లేదు. అంటే ఇకపై ఆయా ప్రాంతాల నుంచి దరఖాస్తు చేసుకునేవారు పొరుగు జిల్లాలను ఎంచుకోవాల్సిందే.
మరికొన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి రానుందని భావిస్తున్నారు. ఈసారి పేపర్-1కు డీఈడీతోపాటు బీఈడీ అభ్యర్థులు కూడా దరఖాస్తు చేస్తున్నారు. ఆ పరీక్ష ఉదయమే ప్రారంభం అవుతుంది. దీంతో ప్రయాణ దూరాన్ని బట్టి ఒకరోజు ముందే ఆయా జిల్లాలకు వెళ్లాలి. అది పేద అభ్యర్థులకు ఆర్థికంగా పెను భారం అవుతుంది. ఉన్నతాధికారులు స్పందించి కేంద్రాల సంఖ్య పెంచి ఎక్కడి వారు అక్కడే పరీక్ష రాసే వెసులుబాటును కల్పించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
Also Read
Telangana: మందు ఎక్కువైంది.. ఇద్దరు యువకులు పెళ్లి చేసుకున్నారు.. కట్ చేస్తే..