ఆంజనేయుడికి బంగారపు గద, చక్రం, తోరణం ఇచ్చారు.. 2 రోజుల తర్వాత తనిఖీల్లో ఊహించని ట్విస్ట్..

రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలంటూ ఆంజనాద్రి ఆలయానికి సమర్పించిన విరాళం ఇప్పుడు భారీ వివాదంగా మారింది. అధికారుల తనిఖీలో ఆభరణాల్లో కేవలం 28 గ్రాములే అసలు బంగారం ఉన్నట్లు తేలడంతో అందరూ నివ్వెరపోయిన పరిస్థితి. పూర్తి వివరాలు కథనం లోపల ..

ఆంజనేయుడికి బంగారపు గద, చక్రం, తోరణం ఇచ్చారు.. 2 రోజుల తర్వాత తనిఖీల్లో ఊహించని ట్విస్ట్..
Gold Donation Controversy

Updated on: May 11, 2026 | 6:01 PM

భక్తి పేరుతో ఇచ్చే కానుకలు దేవుడిపై విశ్వాసానికి ప్రతీకగా భావిస్తారు. ముఖ్యంగా ఆలయాలకు బంగారం, వెండి ఆభరణాలు విరాళంగా ఇస్తే.. భక్తులు దాన్ని గొప్ప దానంగా చూస్తారు. కానీ ఇప్పుడు కర్నాటకలోని కొప్పల్ అంజనాద్రి కొండపై ఉన్న ప్రసిద్ధ హనుమాన్ ఆలయంలో జరిగిన ఘటన మాత్రం భక్తులనే షాక్‌కు గురిచేస్తోంది. కోట్ల విలువైన బంగారు ఆభరణాలంటూ ఘనంగా ప్రకటించిన విరాళం.. అధికారుల తనిఖీలో తేలిపోయి వివాదంగా మారింది. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త మహేశ్ రెడ్డి.. మే 8న ఆంజనాద్రి ఆలయానికి కిరీట తోరణం, చక్రం, గద వంటి ఆభరణాలను విరాళంగా అందించారు. ఈ సందర్భంగా కర్నాటక రాష్ట్రం గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. తన సన్నిహితుడు దేవుడికి సుమారు రూ.2.5 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు సమర్పించారని ఆయన ప్రకటించడంతో ఈ విరాళం భారీ చర్చకు దారితీసింది.

అయితే ఆలయ ట్రెజరీలో ఈ ఆభరణాలను అధికారికంగా జమ చేయడానికి ముందు జిల్లా దేవాదాయ యంత్రాంగం నిబంధనల ప్రకారం పరిశీలన చేపట్టింది. అసిస్టెంట్ కమిషనర్ మహేశ్ మలగిట్టి నేతృత్వంలో జరిగిన వెరిఫికేషన్‌లో షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. మొత్తం ఆభరణాల్లో కేవలం 28 గ్రాముల మాత్రమే అసలు బంగారం ఉన్నట్లు.. మిగతా భాగం గోల్డ్ ప్లేటింగ్ చేసిన రాగితో తయారైందని అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఇంకా ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ఈ ఆభరణాలకు సంబంధించిన అసలు కొనుగోలు బిల్లులు, నాణ్యత ధ్రువీకరణ పత్రాలు కూడా దాత సమర్పించలేదని తెలుస్తోంది. దాత కోరిక మేరకు రెండు రోజుల పాటు మాత్రమే దేవుడి అలంకరణలో ఈ ఆభరణాలను ఉపయోగించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ వ్యవహారం బయటపడటంతో జిల్లా అధికారులు మహేశ్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. ఆభరణాల అసలు విలువ ఎంత..? వాటిని ఎక్కడ కొనుగోలు చేశారు..? సంబంధిత ఇన్వాయిసులు ఏమిటి..? అనే వివరాలు సమర్పించాలని ఆదేశించారు. సరైన పత్రాలు అందే వరకు ఆ ఆభరణాలను ప్రభుత్వ ట్రెజరీలో జమ చేయబోమని స్పష్టం చేశారు.

ఈ ఘటన ఇప్పుడు భక్తుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. దేవుడి పేరుతో ప్రచారం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా..? నిజంగా భక్తి ఉందా లేక పబ్లిసిటీ కోసమా..? అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆలయ పవిత్రతను కాపాడటంతో పాటు విరాళాల విషయంలో పారదర్శకత అత్యంత ముఖ్యమని అధికారులు చెబుతున్నారు.

గుంటూరులో దశాబ్దాల ట్రాఫిక్ కష్టాలకు చెక్.. త్వరలో రయ్ రమ్ మంటూ.. 

Follow Us