తెలంగాణ రాష్ట్రంలో 4 రోజులపాటు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నేటి (శుక్రవారం) నుంచి వచ్చే నెల మూడో తేదీ వరకు వివిధ జిల్లాల్లో ఎండలు గరిష్ఠ స్థాయిలో ఉంటాయని, మరికొన్ని జిల్లాల్లో సాధారణం కన్నా రెండు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెల్పింది. శుక్రవారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు ఏడు జిల్లాల ప్రజలు, అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమురంభీం-ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణపేట, వనపర్తి, జోగులాంబ-గద్వాల, నాగర్‌కర్నూల్ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాలకు యెల్లో అలెర్ట్ జారీ చేసింది.
కాగా ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గురువారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక రాజన్న-సిరిసిల్ల, నిజామాబాద్, సిద్దిపేట, నల్గొండ, జగిత్యాల, ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, జోగులాంబ-గద్వాల, వికారాబాద్, యాదాద్రి-భువనగిరి, కుమురంభీం-ఆసిఫాబాద్, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోనూ 40 డిగ్రీలపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా రాష్ట్రంలో ఆరుబయట పని చేసే వారు, ప్రయాణాలు చేసే వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ప్రకటించింది. సాధారణంగా ఉష్ణోగ్రతలు 35.9 డిగ్రీతు దాటితే వాతావరణ శాఖ మూడు రకాల హెచ్చరికలు (ఎల్లో, ఆరెంజ్, రెడ్) జారీ చేస్తుందనే విషయం తెలిసిందే.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.