Speaker Pocharam Srinivas Reddy: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభకానున్నాయి. మరో మూడు రోజుల్లో సమావేశాలు జరగనున్న నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. శాసనసభ, శాసనమండలి నిర్వహణ, శాంతిభద్రతలు, కరోనా తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీసుశాఖ ఉన్నతాధికారులతో శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం సమీక్షించారు. ఈ సమావేశానికి శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనమండలి చీఫ్ విప్ బోడకంటి వెంకటేశ్వర్లు, లెజిస్లేటివ్ సెక్రటరీ డా. వి. నరసింహాచార్యులు తదితర అధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రానున్న అసెంబ్లీ సమావేశాలు విజయవంతం చేయడానికి సభ్యులంతా సహకరించాలని కోరారు. శాసనసభ, శాసనమండలి సమావేశాలు అవాంతరాలు లేకుండా సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సారి జరిగే సమావేశాల్లో కూడా నిబంధనలు పాటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సమావేశాల్లో భాగంగా అసెంబ్లీతోపాటు పరిసరాలలో రెండు సార్లు శానిటైజేషన్ చేపట్టనున్నట్లు పోచారం శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
సమావేశాల్లో పాల్గొనే సభ్యులందరూ.. సిబ్బంది తప్పకుండా కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కరోనా నిబంధనలు పాటించాలని కోరారు. శుక్రవారం సాయంత్రం నుంచే కరోనా పరీక్షలు ప్రారంభిస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. శాసనసభ్యులు, మండలి సభ్యులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులు, అందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని.. పాజిటివ్ రిపోర్టు వస్తే సభా కార్యకలాపాలకు హాజరుకావొద్దంటూ కోరారు.
Also Read: