Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా లబ్ది.. దరఖాస్తులు ఆహ్వానం..

కొత్తగా రైతు భరోసా పథకం కింద లబ్ది పొందేందుకు ఎదరుచూస్తున్న రైతులకు ప్రభుత్వం తీపికబురు అందించింది. వీరికి దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు మండల కేంద్రాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

Rythu Bharosa: రైతు భరోసాపై తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్.. వారికి కూడా లబ్ది.. దరఖాస్తులు ఆహ్వానం..
Rythu Bharosa

Updated on: Jun 27, 2026 | 7:31 AM

తెలంగాణ రైతులకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. రైతు భరోసా కొత్త దరఖాస్తులపై కీలక ప్రకటన చేసింది. అర్హులైనవారి నుంచి దరఖాస్తులను స్వీకరించాలని నిర్ణయం తీసుకుంది. కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు పొందినవారు రైతు భరోసా పథకం ద్వారా పెట్టుబడి సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నెల 15వ తేదీలోపు భూముల రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఇందుకు జులై 5వ తేదీ వరకు గడువు విధించింది. ఆ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జులై 5 తర్వాత దరఖాస్తు చేసుకుంటే ఈ విడతలో రైతు భరోసా నిధులు అందవని తెలిపింది. జూన్ 30వ తేదీ నుంచి పెట్టుబడి సాయాన్ని విడతల వారీగా లబ్దిదారుల అకౌంట్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో జులై 5లోపు దరఖాస్తు చేసుకున్నవారికి కూడా అందించనుంది.

దరఖాస్తు చేసుకోవడం ఎలా..?

ఆధార్ కార్డు, కొత్త పట్టాదారు పాస్‌బుక్, బ్యాంక్ పాస్ బుక్ మొదటి పేజీ జిరాక్స్, దరఖాస్తు ఫారం నింపి వ్యవసాయ విస్తరణ అధికారి(AEO)లకు సమర్పించాలి. దీంతో అధికారులు మీ అర్హతలను పరిశీలించి లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ప్రస్తుతానికి అందుబాటులో లేదు. కేవలం ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ మండలంలోని వ్యవసాయ విస్తరణ అధికారి లేదా క్లస్టర్ అధికారిని సంప్రదించాలి. రైతు భరోసా దరఖాస్తు ఫారం నింపాలి. అనంతరం దరఖాస్తు ఫారంతో పాటు అవసరమైన పత్రాలను జత చేసి అధికారులకు అందించాలి. మీరు అర్హులైతే రైతు భరోసా పథకంలో లబ్ది పొందేందుకు జిల్లా స్థాయి అధికారులకు సిఫార్సు చేస్తారు.

అర్హతలు ఇవే..

-తెలంగాణకు చెందిన రైతు అయి ఉండాలి

-కనీస వయస్సు 18 సంవత్సరాలుగా ఉండాలి

-దరఖాస్తుదారుడి పేరు మీదనే భూమి ఉండాలి

-వ్యవసాయానికి అనుకూలమైన భూమి అయి ఉండాలి

-RoFR (Recognition of Forest Rights) పట్టాదారులు కూడా రైతు భరోసా పొందేందుకు అర్హులే
-బీడు భూములు, కొండలు, రియల్ ఎస్టేట్, కాల్వలు, రాళ్లు రప్పలు ఉన్న భూములకు రైతు భరోసా పథకం వర్తించదు.

ఈ నెల 30 నుంచి అకౌంట్లో డబ్బులు

జూన్ 30 నుంచి రైతు భరోసా నిధులను విడుదల చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఎకరం భూమి ఉన్న రైతుల దగ్గర నుంచి మొదలుపెట్టి  ఆపైన ఉన్న భూమి ఉన్న రైతులకు విడతల వారీగా జమ చేయాలని నిర్ణయించింది. 10 రోజుల్లోనే అందరికీ అందేలా చర్యలు చేపడుతోంది.

 

Follow Us