
హైదరాబాద్: తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ కనెక్టివిటీని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అమెండెడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్‌లో భాగంగా ‘తెలంగాణ రూరల్ ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ (TRAICL)’ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి భాగస్వామ్యంతో ఈ సంస్థ పనిచేయనుంది.
గ్రామీణ ప్రాంతాలకు నాణ్యమైన ఇంటర్నెట్ సేవలు అందించడమే లక్ష్యంగా ఈ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం టీ-ఫైబర్ జిల్లా, మండల కేంద్రాల వరకు నెట్‌వర్క్‌ను నిర్వహిస్తుండగా, కొత్తగా ఏర్పాటైన TRAICL మండల కేంద్రాల నుంచి గ్రామాల వరకు నెట్‌వర్క్ విస్తరణ, నిర్వహణ బాధ్యతలు చేపట్టనుంది.
ఈ కార్పొరేషన్ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఈవోతో పాటు ఐటీ, ఆర్థిక, పంచాయతీరాజ్, ఇంధన శాఖల ఉన్నతాధికారులు డైరెక్టర్లుగా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం తరఫున ఎక్స్‌అఫీషియో చైర్మన్‌తో పాటు నలుగురు డైరెక్టర్లు సభ్యులుగా వ్యవహరిస్తారు. టీ-ఫైబర్ మేనేజింగ్ డైరెక్టర్‌నే కొత్త కార్పొరేషన్‌కు సీఈవోగా నియమించనున్నారు.
కార్పొరేషన్ నిర్వహణ, విద్యుత్ బిల్లులు, ఇతర కార్యకలాపాల కోసం వచ్చే పదేళ్ల కాలానికి కేంద్ర ప్రభుత్వం రూ.2,600 కోట్ల ఆర్థిక సహాయాన్ని ఆమోదించింది. ఏడాదికి సగటున రూ.260 కోట్ల చొప్పున ఈ నిధులు అందనున్నాయి. అదే సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగాన్ని పెంచేందుకు ‘భారత్‌నెట్ ఉద్యమీ ప్రోగ్రామ్’ కింద తొలి దశలో 3 లక్షల కనెక్షన్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఒక్కో కనెక్షన్‌కు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.300 కోట్ల సహాయం అందించనుంది.
భారత్‌నెట్ ఫేజ్-1, ఫేజ్-2 నెట్‌వర్క్‌లను అప్‌గ్రేడ్ చేయడంతో పాటు ఇప్పటివరకు కనెక్టివిటీ లేని గ్రామాలకు కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. దీంతో తెలంగాణ గ్రామాల్లో డిజిటల్ సేవలు, ఆన్‌లైన్ విద్య, టెలీమెడిసిన్, ఈ-గవర్నెన్స్ సేవలు మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.