
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ నివాసంలో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. సంస్థ అభివృద్ధి, కార్మికుల సమస్యలు, భవిష్యత్ ప్రణాళికలపై విస్తృతంగా చర్చించారు. తమ సమస్యల పరిష్కారానికి సీఎం చొరవ చూపినందుకు కార్మిక సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు. సంస్థ అభివృద్ధి, సేవల మెరుగుదలకు కార్మికులు ముందుకు రావడాన్ని సీఎం అభినందించారు. ప్రభుత్వం-కార్మికులు వేర్వేరు కాదని, అందరం కలిసే ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికుల పోరాటాల్లో తాము ఎప్పుడూ అండగా ఉన్నామని తెలిపారు.
ఆర్టీసీని బలోపేతం చేయడానికి కీలక నిర్ణయాలు తీసుకున్నామని సీఎం వెల్లడించారు. గాజులరామారంలో 100 ఎకరాల్లో బస్ టెర్మినల్, శంషాబాద్‌లో 150 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. 1000 ఈవీ బస్సులు కొనుగోలు చేసి మెట్రోతో అనుసంధానం చేయాలని నిర్ణయించారు. మినీ బస్సుల కొనుగోలు కూడా చేపట్టనున్నట్లు తెలిపారు.
ప్రస్తుతం డీజిల్‌పై సంవత్సరానికి సుమారు రూ. 2000 కోట్ల ఖర్చు అవుతుందని, దీన్ని తగ్గించేందుకు ఈవీ బస్సులే పరిష్కారం అని సీఎం పేర్కొన్నారు. ఆదాయం పెరగాలంటే ఖర్చు తగ్గించుకోవాల్సిందేనని, ఇందుకు పక్కా ప్రణాళిక అవసరమన్నారు. ఆర్టీసీలో ఉన్న బకాయిలు తమ హయాంలో వచ్చినవి కావని, అయినా వాటిని క్లియర్ చేయడానికి కృషి చేస్తున్నామని సీఎం తెలిపారు. పెండింగ్ కారుణ్య నియామకాలను ప్రారంభించామని, ఉద్యోగుల బకాయిల చెల్లింపులో భాగంగా ఇప్పటికే రూ.1000 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు.
యూనియన్లు, విలీనం వంటి అంశాలపై కార్మిక సంఘాలే చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పీఆర్సీ వంటి ఆర్థిక అంశాలపై ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. ఆర్టీసీ సంస్థ దేశంలోనే గొప్ప సంస్థగా నిలవడానికి కార్మికుల పాత్ర కీలకమని సీఎం కొనియాడారు. సంస్థ బలోపేతానికి కార్మికులు సహకరించాలని, రాజకీయ ప్రభావానికి లోనైతే సంస్థకు నష్టం జరుగుతుందని హెచ్చరించారు.
మహాలక్ష్మీ పథకం ద్వారా ఇప్పటికే రూ.8000 కోట్ల మద్దతు ఇచ్చామని, సంస్థ నిలదొక్కుకోవడం కార్మికుల చేతుల్లోనే ఉందని సీఎం స్పష్టం చేశారు. డ్రైవర్లను తగ్గించే ఆలోచన లేదని, సంస్థకు నష్టం కలిగించే చర్యలు చేపట్టొద్దని సూచించారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాలు 3 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, కేసులు ఎత్తివేయాలని సీఎం ను కోరాయి. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం, వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు అధికారులను ఆదేశించారు. ఆర్టీసీ సమస్యలను 100 శాతం పరిష్కరిస్తామని, కార్మికుల హక్కులను ప్రభుత్వం కాపాడుతుందని సీఎం భరోసా ఇచ్చారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.