Telangana: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్‌.. ఇకపై ఆ పప్పులు ఉడకవ్‌!

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఎల్‌కేజీ నుంచి ఇంటర్, డిగ్రీ వరకు ‘స్పెషల్ ఫీజులు’, ‘డెవలప్‌మెంట్ చార్జీలు’, ‘యాక్టివిటీ ఫీజులు’ అంటూ తల్లిదండ్రులపై భారీ భారం మోపుతున్నారనే ఆరోపణలు పెరుగుతున్నాయి. ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా కఠిన చర్యలు కనిపించకపోవడంతో పేరెంట్స్, విద్యార్థి సంఘాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో..

Telangana: ప్రైవేట్ స్కూళ్లకు సీఎం రేవంత్ మాస్ వార్నింగ్‌.. ఇకపై ఆ పప్పులు ఉడకవ్‌!
Telangana Govt May Cancel Private School Permits For Excess Fees

Edited By:

Updated on: Feb 27, 2026 | 10:00 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 27: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖపై సీరియస్ రివ్యూ నిర్వహించారు. ప్రీ-ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర విధానం రూపొందించేందుకు ఏర్పాటు చేసిన తెలంగాణ విద్యా కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు అతిక్రమించి అధిక ఫీజులు వసూలు చేస్తే ప్రైవేట్ పాఠశాలల గుర్తింపు రద్దు చేయడంతో పాటు, అదనంగా తీసుకున్న మొత్తాన్ని రికవరీ చేసేలా కఠిన నిబంధనలు రూపొందించాలని సూచించారు.

ఫీజుల నియంత్రణపై సిద్ధం చేసిన ప్రతిపాదనలను ప్రజాభిప్రాయం కోసం అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచాలని కూడా పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరిగిన ఈ సమీక్షలో ప్రభుత్వ పాఠశాలల బలోపేతంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కోర్ అర్బన్ రీజియన్‌లో మౌలిక వసతులు మెరుగుపరచాలని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. భారతీయ విద్యా భవన్, జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ స్థాయి సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని, ప్రతి విద్యార్థికి పాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పాలను విజయ డైరీ నుంచి సేకరించాలని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం నాణ్యతను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పరిశీలించాలని అధికారులకు సూచించారు. కోర్ అర్బన్ ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇతర నియోజకవర్గాల్లో కూడా పైలట్ ప్రాజెక్టుల రూపంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అభివృద్ధి చేయాలని సూచించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్ల ప్రభుత్వ పాఠశాల మోడల్‌ను విస్తరించి, విద్యార్థులకు ట్రాన్స్‌పోర్ట్ సహా పూర్తి సౌకర్యాలు కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. విద్యార్థుల రవాణా కోసం ఎలక్ట్రిక్ బస్సుల అవకాశాలపై అధ్యయనం చేయాలని కూడా హితవు పలికారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలో సమగ్ర విద్యా విధానం రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన కమిషన్ 305 పాఠశాలలను సందర్శించి, 46 సమావేశాల ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అభిప్రాయాలను సేకరించి నివేదిక రూపొందించింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్‌ను అమలు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. మొత్తానికి… ప్రైవేట్ ఫీజుల నియంత్రణ నుంచి ప్రభుత్వ పాఠశాలల అప్‌గ్రేడేషన్ వరకు సమగ్ర మార్పుల దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుండటం రాష్ట్ర విద్యా రంగంలో పెద్ద చర్చకు దారితీస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us