Revanth Reddy Hot Comments: రాష్ట్రంలో కాంగ్రెస్‌పై చర్చ జరగకుండా ఉండేందుకు అధికార పార్టీ టీఆర్ఎస్, బీజేపీ ఉమ్మడి వ్యూహం రచిస్తున్నాయని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. సీఎం కేసీఆర్ – బండి సంజయ్‌ల మధ్య మాటల యుద్ధం కల్లు కాంపౌండ్‌ను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో నిర్వహిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తల శిక్షణా శిబిరంలో ఆయన ప్రసంగించారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్‌పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను కనుమరుగు చేసేందుకు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు.
నీళ్లు, నిధుల పేరుతో కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన రేవంత్ రెడ్డి.. ఆయన అవినీతిని బయటపెట్టేందుకు సీబీఐ విచారణ జరగాలన్నారు. మంత్రులు ఇసుక మాఫియా చేస్తున్నారని ఆరోపించిన రేవంత్.. వారి అవినీతిని నిరూపించకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటాని సవాల్ విసిరారు. టీఆర్ఎస్ నేతలపై సీబీఐ విచారణ వేయించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని రేవంత్ కోరారు.
మరోవైపు, తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈనెల 13న ఢిల్లీకి వస్తే…హుజూరాబాద్ ఓటమిపై చర్చిద్దామని తెలిపింది. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కేవలం 1.46 శాతం ఓట్లు రావడం ఏంటి అని ఇప్పటికే నేతలను ప్రశ్నించింది. ఈ ఓటమికి కారణాలేంటి? అభ్యర్థి ఎంపికలో ఏం జరిగింది? ప్రచారంలో సీనియర్లు పాల్గొనలేదా? అనే అంశాలపై అధిష్టానం సీనియర్లను తీవ్రంగా ప్రశ్నించే అవకాశం కన్పిస్తోంది.
Read Also… Gangula Kamalakar: రైతుల యాసంగి పంటను కేంద్రం కొనాల్సిందే.. లేదంటే ఉద్యమిస్తాంః మంత్రి గంగుల