Karimnagar Corporation Election Result: బండి సంజయ్ ఇలాకాలో కమల వికాసం.. మేయర్ పీఠం కైవసం చేసుకున్న బీజేపీ..

కరీంనగర్ కార్పొరేషన్ మరోసారి బీజేపీకి తిరుగులేని కంచుకోట అని రుజువైంది. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం కొనసాగుతున్నప్పటికీ.. కరీంనగర్‌లో మాత్రం కమలం వికసించింది. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించిన బీజేపీ.. మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుని తన రాజకీయ సత్తాను చాటింది.

Karimnagar Corporation Election Result: బండి సంజయ్ ఇలాకాలో కమల వికాసం.. మేయర్ పీఠం కైవసం చేసుకున్న బీజేపీ..
Karimnagar Municipal Corporation Results

Updated on: Feb 13, 2026 | 6:21 PM

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశించినంత ఫలితాలు రాలేదు. అయితే బండి సంజయ్ ఇలాఖా కరీంనగర్ కార్పొరేషన్‌లో కమలం పార్టీ సత్తా చాటి చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతున్నప్పటికీ, ఉత్తర తెలంగాణకు రాజకీయ గుండెకాయ వంటి కరీంనగర్‌లో మాత్రం కమలం వికసించింది. ఈ విజయంతో కరీంనగర్ మరోసారి బీజేపీకి, ముఖ్యంగా బండి సంజయ్‌కు తిరుగులేని కంచుకోట అని రుజువు అయ్యింది. మొత్తం 66 డివిజన్లకు జరిగిన ఈ హోరాహోరీ పోరులో బీజేపీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఫలితాలను పరిశీలిస్తే.. బీజేపీ 33 స్థానాల్లో ఘనవిజయం సాధించగా, కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 9, ఎంఐఎం 7, ఇతరులు 5 స్థానాలకే పరిమితమయ్యారు. గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మూడవ స్థానానికి పడిపోవడం గమనార్హం. కాంగ్రెస్ తన బలాన్ని కొంత మేర పెంచుకున్నప్పటికీ బీజేపీ జోరును అడ్డుకోవడంలో విఫలమైంది.

కరీంనగర్ కార్పొరేషన్‌లో మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి కావాల్సిన మేజిక్ ఫిగర్ 34. బీజేపీ 33 స్థానాలతో మెజారిటీకి కేవలం ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఈ తరుణంలో స్థానిక ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఎక్స్-అఫీషియో ఓటు బీజేపీకి శ్రీరామరక్షగా మారింది. ఈ ఓటుతో బీజేపీ బలం 34కు చేరుకోవడంతో ఎటువంటి రాజకీయ సమీకరణలు లేదా ఇతర పార్టీల మద్దతు అవసరం లేకుండానే మేయర్ పీఠాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.

ఈ విజయం బండి సంజయ్ కృషికి నిదర్శనమని పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన పాదయాత్రలు, హిందూత్వ ఎజెండా, అభివృద్ధి నినాదం ఓటర్లను ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాత నగరంలోని డివిజన్లలో కూడా బీజేపీ గట్టి పోటీ ఇచ్చి స్థానాలను గెలుచుకోవడం విశేషం. ఎంఐఎం 7 స్థానాలకే పరిమితం కావడం, ముస్లిం ఓట్ల చీలిక కూడా బీజేపీకి కలిసొచ్చిన అంశాలుగా విశ్లేషకులు భావిస్తున్నారు.