Telangana Minister Srinivas goud hot comments on YSR : తెలంగాణను ఎదగనీయకుండా చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పురావస్తు శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి నరరూప రాక్షసుడని అభివర్ణించించిన ఆయన, తెలంగాణ నీటిని వైయస్ దోచుకున్నారని ఆరోపించారు. తాగడానికి కూడా తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తండ్రిని మించి ఏపీ ముఖ్యమంత్రి జగన్ జలదోపిడీ చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణకు నష్టం కలుగుతుంది అంటే కేసీఆర్ ఊరుకోరన్న శ్రీనివాస్ గౌడ్.. తెలంగాణను నాశనం చేసినోళ్ళ విగ్రహాలు కూడా తెలంగాణలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
“తెలంగాణలో ఆంధ్రా నేతలు విగ్రహాలు ఉంటాయి. ఆంధ్రాలో మాత్రం తెలంగాణ నేతల విగ్రహాలు అసలే ఉండవు గొప్ప నేతల విగ్రహాలు ఎక్కడైనా ఉండొచ్చు. తెలంగాణ మంత్రులు ఆంధ్రాకు వెళ్తే ఏకవచనంతో మాట్లాడతారు. కనీస గౌరవం ఇవ్వరు. ” అని శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఏనాడైనా ఆంధ్రా నేతలను తెలంగాణలో అగౌరవపర్చామా? అని ప్రశ్నించిన శ్రీనివాస్ గౌడ్.. అధికారుల విషయంలోనూ ఇదే తీరు ఆంధ్ర నేతల్లో కనిపిస్తుందని విమర్శించారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం జగన్‌పై రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిప్పులు చెరిగారు. తెలంగాణకు అన్యాయం చేసినా వైఎస్సార్‌ను దొంగ అనకపోతే దొర అనాలా? అని ప్రశ్నించారు. తెలంగాణకు వైఎస్సార్ నరరూప రాక్షసుడు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. ఢిల్లీలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
తెలంగాణ వెనుకబాటు తనానికి కూడా వైయస్సారే కారణమని మంత్రి పేర్కొన్నారు. పాలమూరు ప్రజలు వలస పోవడానికి కూడా వైస్ రాజశేఖర్ రెడ్డి కారణమని చెప్పారు. పోతిరెడ్డిపాడుకు నీటిని తరలించుకుపోయి.. పాలమూరు జిల్లా ప్రజలకు తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని దుర్మార్గుడు వైఎస్సార్ అని మండిపడ్డారు. ఎంతో మంది చావులకు ఆయన కారకుడు. ఏపీతో మంచిగా ఉండాలని కేసీఆర్ భావిస్తున్నా.. జగన్ అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారు అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.
Read also : YS Sharmila : మంత్రి కేటీఆర్ ఇలాకా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న వైయస్. షర్మిల