
మీరు తెలంగాణలో ఉంటున్నారా..? తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పొందాలనుకుంటున్నారా..? అయితే ఇది మీ కోసమే. ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ రూల్స్ మారనున్నాయి. కఠిన నిబంధనలు అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే మరింత కఠినం కానుంది. దీనికి కారణం ఏంటంటే.. అదనంగా మరో టెస్ట్‌లో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కొత్త పద్దతిని తీసుకొచ్చింది. దీని వల్ల రోడ్లు యాక్సిడెంట్లు తగ్గుతాయని, రోడ్లు ప్రమాదాలు కూడా భారీగా తగ్గుతాయని రవాణాశాఖ భావిస్తోంది. అసలు ఏంటీ ఈ కొత్త రూల్స్..? అనేది ఇందులో చూద్దాం.
ఇప్పటివరకు డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే కేవలం రెండు పరీక్షలు మాత్రమే పాస్ అవ్వాల్సి ఉండేది. ముందుగా లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్(LLR) పరీక్ష ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ విధానంలో ఈ టెస్ట్ ఉంటుంది. ఇది పాస్ అయిన వెంటనే మీకు ఎల్‌ఎల్‌ఆర్ జారీ చేస్తారు. ట్రాఫిక్ రూల్స్, నిబంధనల గురించి ఈ టెస్టులో ప్రశ్నలు అడుగుతారు. ఎల్‌ఎల్‌ఆర్ ఆరు నెలల పాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ఆరు నెలల్లోపు మీరు డ్రైవింగ్ టెస్ట్‌కు హాజరుకావాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ కోసం అప్లై చేసుకుంటే మీ డ్రైవింగ్‌ను పరిక్షించేందుకు టెస్ట్ నిర్వహిస్తారు. అందులోనూ మీరు క్వాలిఫై అయితే డ్రైవింగ్ లైసెన్స్ రవాణాశాఖ జారీ చేస్తుంది. అయితే ఇక నుంచి ఈ రెండు టెస్టులతో పాటు మరో టెస్టు కూడా నిర్వహిస్తారు.
ఏప్రిల్ నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌కు ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఏప్రిల్ తొలివారం నుంచి దీనికి అమలు చేయనున్నారు. ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకునే ముందు మీరు ఈ టెస్ట్‌కు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది. ఈ పరీక్ష మొత్తం మూడు గంటలు ఉంటుంది. పూర్తిగా ఆన్ లైన్‌లో ఈ టెస్టు ఉంటుంది. దీంతో మీరు మీ ఇంటి వద్ద నుంచే పరీక్ష పూర్తి చేయొచ్చు. ఈ టెస్ట్‌లో మొత్తం 6 మాడ్యూళ్లు ఉంటాయి. ఒక్కొ మాడ్యూల్ 30 నిమిషాల పాటు ఉంటుంది. పరీక్ష పాస్ అయితే మీకు ఒక ప్రత్యేక సర్టిఫికేట్ నవంబర్ ఇస్తారు. దీని ఆధారంగా మీరు ఎల్‌ఎల్‌ఆర్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రోడ్ సేప్టీ గురించి ఈ పరీక్షలు ప్రశ్నలు ఉంటాయి. ఇక డ్రైవింగ్ స్కూల్ సెంటర్ నుంచి కూడా ఈ పరీక్షకు మీరు హాజరుకావొచ్చు.