Telangana Integration Day: పరేడ్ గ్రౌండ్ దగ్గర ఫ్లెక్సీల కలకలం రేపాయి. తెలంగాణ విమోచన దినం అని చెబుతూ.. కేంద్రం ఎందుకు ఒక్క రూపాయి ఇవ్వలేదంటూ ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. గోవా విమోచన దినోత్సవానికి రూ. 300 కోట్లు ఇచ్చిన అమిత్ షా.. తెలంగాణకు ఏమైనా ఇస్తారా? అని ప్లెక్సీలో ప్రశ్నించారు. పరేడ్ గ్రౌండ్స్‌లో ఏమైనా ప్రకటన చేస్తారా? అంటూ ప్లెక్సీలో ప్రశ్నించారు. ఇదిలాఉంటే.. 40 శాతం కమషన్ సీఎం అంటూ మరికొన్ని ప్లెక్సీలు వెలిశాయి. ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి.. కాంట్రాక్టులు, ఉద్యోగాల కోసం కమిషన్లు తీసుకుంటున్నారంటూ ఇటీవల తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ ఆరోపణలను ప్రస్తావిస్తూ వెలసిన ప్లేక్సీలు ఇప్పుడు కలకం రేపుతున్నాయి. కాగా, గతంలో కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సమయంలోనూ కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఇలాంటి ప్లెక్సీలే వెలిశాయి. ఇప్పుడు అమిత్ షా సభ నేపథ్యంలో రోడ్లపై మరోసారి అలాంటి భారీ ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయి.
ఇదిలాఉంటే.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకకు సంబంధించి బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొంటున్నారు. వీరితో పాటు.. పలువురు కేంద్ర మంత్రులు, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే సహా పలువురు ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఉదయం 8.30 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లో అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. అనంతరం అమిత్ షా ప్రసంగిస్తారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..