
ట్రాఫిక్ చలాన్ల వసూళ్లపై ట్రాఫిక్ పోలీసులకు తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పెండింగ్ చలాన్కలు కట్టాల్సిందేనని రూడ్లపై బలవంతం పెట్టోద్దని తెలిపింది. పెండింగ్ చలాన్ల పేరుతో వాహనాల తాళాలు లాక్కోవడం, వాహనం ఆపి అక్కడికక్కడే డబ్బులు చెల్లించాలని వాహనదారులను ఒత్తిడి తీసుకురాకూడదని స్పష్టం చేసింది. బైక్ తాళాలు లాక్కోవడం, వాహనాన్ని నిలిపివేయడం కుదరదన్న హైకోర్టు తేల్చి చెప్పింది. ఒకవేళ పెండింగ్‍లో ఉన్న చలాన్ల వసూలు చేయాలని పోలీసులు భావిస్తే కోర్టు చట్టం ప్రకారం మాత్రమే వెళ్లాలని తెలిపింది. వాహనదారులు స్వచ్ఛందంగా చలాన్లు చెల్లిస్తేనే తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. పెండింగ్ చలాన్ల విషయంలో నమోదైన పిటిషన్‌పై మంగళవారం (జనవరి 20,2026) హైకోర్టు విచారణ జరిపి ఈ ఆదేశాలు జారీ చేసింది.
హైదరాబాద్ మహానగరంతోపాటు తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనల అమలు కోసం ట్రాఫిక్ పోలీసులు అనుసరిస్తున్న విధానాలను సవాలు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు అయ్యింది. దీనిపై మంగళవారం (జనవరి 20) విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. శ్రవణ్ కుమార్.. ఈ మేరకు ట్రాఫిక్ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. కేవలం పెండింగ్ చలాన్లు వసూలు చేయడం కోసమే వాహనదారులను ఆపడాన్ని కోర్టు తప్పుబట్టింది. ఇష్టానుసారంగా రోడ్లపై వాహనాలను ఆపడానికి ట్రాఫిక్ పోలీసులకు అధికారం లేదని, ఈమేరకు ఆదేశాలు జారీ చేయాలంటూ పిటిషనర్ కోర్టును కోరారు. అయితే, మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 208, సంబంధిత కేంద్ర మోటారు వాహన నిబంధనల ప్రకారం.. జరిమానాలు లేదా జైలు శిక్షను నిర్ణయించే అధికారం న్యాయస్థానానికి మాత్రమే ఉందని పిటిషన్‌లో వాదించారు.
కాగా, ట్రాఫిక్ రూల్స్ అమలు చేయడంలో అనధికార మొబైల్ డివైజ్‌లు వినియోగంపై కూడా పిటిషనర్ సవాలు చేశారు. G.O. Ms. No. 108 జీవో ఆధారంగా పెండింగ్‌లో ఉన్న జరిమానాలను చెల్లించమని పోలీసులు పౌరులను బలవంతం చేయడాన్ని పిటిషనర్ తప్పుపట్టారు. ఆ జీవో చట్టబద్ధతను పిటిషనర్ ప్రశ్నించారు. ఇది కేంద్ర మోటారు వాహనాల చట్టానికి విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..