Palle Pragathi / Pattana Pragathi: తెలంగాణలో జులై 1వ తేదీ నుంచి చేపట్టనున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిపై అధికారులు దృష్టి సారించి ముందుకు సాగాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. పల్లె ప్రగతి, హరితహారంపై ఆయా జిల్లా కలెక్టర్లు, అధికారులతో శనివారం ప్రగతి భవన్ లో సీఎం కే. చంద్రశేఖర్ రావు సమీక్ష చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జులై 1 నుంచి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి సంబంధించిన పనులను పెండింగ్ లో పెట్టొదని పేర్కొన్నారు. పంచాయతీరాజ్ శాఖకు ప్రభుత్వం బాగా సహకరిస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఇంటికి 6 మొక్కలు ఇచ్చి, నాటేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. అయితే.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కోసం ఒక్కో జిల్లాకు రూ. కోటి చొప్పున, హైదరాబాద్ మినహా 32 జిల్లాలకు రూ. 32 కోట్లు మంజూరు చేస్తూ కేసీఆర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నిధులను పల్లె, పట్టణ ప్రగతి పనుల కోసం వినియోగించుకోవాలని సూచించారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో ఈ ఏడాది పంటలు బాగా పండాయని, దీంతో రాష్ట్రానికి అదనపు రైస్ మిల్లులు అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. రైస్ మిల్లుల సంఖ్యను పెంచి, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. రైతులకు అధికారులు అండగా నిలబడాలని ఆయన స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు కేటాయించిన భూములను రిజిస్ర్టేషన్ చేయాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. పంచాయతీలు, మున్సిపాలిటీల పేర్లపై రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. కల్తీ విత్తనాల అమ్మకాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
Also Read: