AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంగన్వాడీ సిబ్బందికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష పెంపు!

రాష్ట్రంలోని అంగన్వాడీ సిబ్బంది విషయంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏళ్ల తరబడి సేవలందిస్తున్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు పదవీ విరమణ సమయంలో అందించే సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్‌ను పెంతున్నట్టు ప్రకటించింది. గతంలో ఉన్న మొత్తానికి రెట్టింపు ప్రయోజనాన్ని కల్పిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

అంగన్వాడీ సిబ్బందికి అదిరిపోయే గుడ్‌న్యూస్.. టీచర్లకు రూ.2లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష పెంపు!
Telangana Anganwadi Benefits News
Ashok Bheemanapalli
| Edited By: |

Updated on: Aug 18, 2026 | 3:35 PM

Share

రాష్ట్రంలోని అంగన్వాడీ సిబ్బందికి తెలంగాణ సర్కార్ ఎగిరిగంతేసే వార్త చెప్పింది. పదవి విరమణ సమయంలో అందించే ఎండ్ బెనిఫిట్స్‌ను రెట్టింపు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం 65 ఏళ్ల వయస్సు పూర్తయి విధుల నుంచి తప్పుకునే అంగన్వాడీ టీచర్లకు రూ.2 లక్షలు, హెల్పర్లకు రూ.లక్ష చొప్పున సర్వీస్ ఎండ్ బెనిఫిట్ అందుతుంది. అంతేకాదు.. 60 ఏళ్లు దాటిన అంగన్వాడీ సిబ్బంది వ్యక్తిగత కారణాలతో స్వచ్ఛందంగా విధుల నుంచి వైదొలిగినా ఇదే ప్రయోజనం పొందేలా ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది.

కేంద్రం అమలు చేస్తున్న మిషన్ సక్షమ్ అంగన్వాడీ అండ్ పోషణ్ 2.0 మార్గదర్శకాలకు అనుగుణంగా అంగన్వాడీ సిబ్బంది గరిష్ట పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లుగా నిర్ణయించారు. గతంలో అంగన్వాడీ టీచర్లకు రూ.లక్ష, హెల్పర్లు, మినీ అంగన్వాడీ వర్కర్లకు రూ.50 వేలుగా సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ ఉండేవి. తాజాగా ప్రభుత్వం ఈ మొత్తాలను పెంచింది.

ఇప్పటికే పెంచిన ప్రయోజనాల ప్రకారం అర్హులైన పలువురు అంగన్వాడీ సిబ్బందికి చెల్లింపులు కూడా ప్రారంభమయ్యాయి. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు 2,572 మంది సిబ్బంది బ్యాంకు ఖాతాల్లో సర్వీస్ ఎండ్ బెనిఫిట్స్ కింద రూ.15.61 కోట్లు జమ చేసినట్లు మహిళా, శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఇందులో 473 మంది అంగన్వాడీ టీచర్లకు రూ.4.73 కోట్లు, 1,930 మంది హెల్పర్లకు రూ.9.65 కోట్లు చెల్లించారు.

పెంచిన ప్రయోజనాల కింద మరో 14 మంది టీచర్లకు రూ.28 లక్షలు, 59 మంది హెల్పర్లకు రూ.59 లక్షలు అందించారు. గతంలో అమల్లో ఉన్న నిబంధనల ప్రకారం మరో 96 మంది అంగన్వాడీ సిబ్బందికి రూ.36.10 లక్షల బెనిఫిట్స్ చెల్లించినట్లు ప్రభుత్వం తెలిపింది.

అంగన్వాడీ సిబ్బందికి రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించడంతో పాటు, సుదీర్ఘకాలం సేవలందించిన వారికి గౌరవప్రదమైన ప్రయోజనం అందించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో పదవీ విరమణ చేసిన అంగన్వాడీ సిబ్బందికి కూడా ప్రస్తుత ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించినట్లు వెల్లడించింది.

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడగా.. మరికొన్ని జిల్లాల్లో కూడా త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us