Telangana Governor Tamilisai Soundararajan: ఓ వైపు తెలంగాణలో కరోనా…మరోవైపు మునిసిపల్ ఎన్నికలు. మహమ్మారి మరింత విజృంభించే ఛాన్స్ ఉండటంతో.. రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీశారు. ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఎన్నికల కమిషనర్‌ను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కోవిడ్ కష్టకాలంలోనూ అధికార, విపక్షాలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకూ కేసులు సంఖ్య పెరగడంతోపాటు మరణాలు సంభవిస్తున్నాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల తర్వాత…సీఎం కేసీఆర్ సహా వందలాది మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్‌తోపాటు ఐదు మునిసిపాలిటీలో కూడా ప్రతిరోజూ రికార్డుస్థాయిలో కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి.
అటు, అభ్యర్థులు, వారి అనుచరగణం ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునే క్రమంలో వారిని ముట్టుకోవడం, గుంపులు గుంపులుగా తిరుగుతుండటం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషనర్‌కు ఫోన్ చేసిన గవర్నర్ తమిళిసై.. ఎన్నికల నిర్వహణ పరిస్థితులపై ఆరా తీశారు. ఎలక్షన్ కమిషన్ గైడ్‌లైన్స్, ఆరోగ్యశాఖ రిపోర్ట్‌కు అనుగుణంగా.. ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు ఎన్నికల కమిషనర్ వివరించినట్లు సమాచారం. ఎన్నికల నిర్వహణపై సమగ్ర నివేదిక అందజేయాలని గవర్నర్ సూచించినట్లు తెలుస్తోంది.
మరోవైపు వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు సహా.. ఐదు మున్సిపాలిటీలకు ఈ నెల 30న పోలింగ్ జరగాల్సి ఉంది. కరోనా సివియర్‌గా మారడంతో.. పోలింగ్‌పై సందేహాలు అలుముకున్నాయి. ఎన్నికలు వాయిదా వేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎస్‌ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తమకు ఓకే అంటోంది అధికార పక్షం. ఈసీ మాత్రం పోలింగ్ నిర్వహణకే మొగ్గు చూపుతోంది. అధికార, విపక్ష పార్టీలు మాత్రం జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అటు నైట్ కర్ఫ్యూ… ఇటు డేలో ప్రచారంతో నాయకులు, ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కరోనా విజృంభణ పీక్స్‌లో ఉన్న వేళ ఎన్నికల నిర్వహణపై ఆందోళన చెందుతున్నారు.
ఇదిలావుంటే, ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ ఛార్జిషీట్ విడుదల చేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో అధికార పార్టీ విఫలమైందని బీజేపీ ఎన్నికల ఇంఛార్జ్ చింతల రామచంద్రారెడ్డి మండిపడ్డారు. మొత్తం 10 రకాల వైఫల్యాలతో కూడిన ఛార్జిషీట్‌ను ఆయన మీడియా సమక్షంలో రిలీజ్ చేశారు.