హైదరాబాద్ మహానగరానికి కొత్త రూపం.. ‘హిల్ట్’ పాలసీ విధివిధానాలు ఖరారు చేసిన సర్కార్..!

HILT పాలసీ విధివిధానాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. ORR పరిధిలో 9వేల 292 ఎకరాల పరిశ్రమల భూముల మార్పిడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాత ఇండస్ట్రీయల్ ల్యాండ్స్‌కు మల్టీ-యూజ్ జోన్ హోదా కల్పించారు. ఐటీ పార్కులు, నివాస ప్రాజెక్టులు, కమర్షియల్ కాంప్లెక్స్‌లకు ఈ భూములను వాడేలా అవకాశం ఇచ్చారు.

హైదరాబాద్ మహానగరానికి కొత్త రూపం.. ‘హిల్ట్’ పాలసీ విధివిధానాలు ఖరారు చేసిన సర్కార్..!
Hilt Policy

Updated on: May 24, 2026 | 7:59 AM

హైదరాబాద్ మహానగర భవిష్యత్తు, పారిశ్రామిక అభివృద్ధికి, రియల్ ఎస్టేట్ రంగాన్ని మలుపు తిప్పే కీలక నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత ‘హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్’ (HILT) పాలసీ అమలుకు రంగం సిద్ధం చేస్తూ, దాని విధివిధానాలను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. ఔటర్ రింగ్ రోడ్ (ORR) పరిధిలో ఉన్న సుమారు 9,292 ఎకరాల పారిశ్రామిక భూములను మల్టీ-యూజ్ జోన్లుగా మార్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

గత ఐదు దశాబ్దాలలో హైదరాబాద్ మహానగరం ఊహించని వేగంతో విస్తరించింది. ఒకప్పుడు నగరం వెలుపల నిర్మించిన బాలానగర్, సనత్‌నగర్, ఉప్పల్, జీడిమెట్ల, మల్లాపూర్ వంటి పారిశ్రామిక వాడలు ఇప్పుడు దట్టమైన జనావాసాల మధ్యకు వచ్చేశాయి. ఫ్యాక్టరీల పక్కనే అపార్ట్‌మెంట్లు, కాలనీలు వెలియడంతో ప్రజలు తీవ్ర కాలుష్య బారిన పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా, ఓఆర్ఆర్ లోపల ఉన్న పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించి, ఆ భూములను ప్రజోపయోగ ప్రదేశాలుగా మార్చడమే హిల్ట్ పాలసీ ప్రధాన ఉద్దేశం.

భూముల బదలాయింపు.. మల్టీ-యూజ్ జోన్ హోదా

ఈ పాలసీ కింద పాత ఇండస్ట్రియల్ ల్యాండ్స్‌కు ‘మల్టీ-యూజ్’ హోదా కల్పించారు. దీనివల్ల ఆయా భూములను కేవలం ఫ్యాక్టరీలకే కాకుండా.. ఐటీ పార్కులు, నివాస ప్రాజెక్టులు అపార్ట్‌మెంట్లు, విల్లాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, అత్యాధునిక ఆసుపత్రులు, అంతర్జాతీయ విద్యాసంస్థల ఏర్పాటుకు వాడుకునే వెసులుబాటు లభిస్తుంది. పరిశ్రమలు తరలించే యజమానులకు నష్టపరిహారంగా ఓఆర్ఆర్ వెలుపల ప్రత్యామ్నాయ భూములను ప్రభుత్వం కేటాయించనుంది. ఈ ప్రక్రియపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఇప్పటికే యజమానులతో కీలక సమావేశం నిర్వహించారు. త్వరలోనే ప్రజలు, వాటాదారుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఒక ప్రత్యేక టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తెస్తోంది.

హిల్ట్ పాలసీ ప్రకటించినప్పటి నుండి తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. ఈ విధానం వెనుక లక్ష కోట్ల రూపాయల భూ కుంభకోణం దాగి ఉందంటూ ప్రతిపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే పారిశ్రామిక వాడల్లో పర్యటించి, భూముల కన్వర్షన్‌కు ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అయితే, విపక్షాల ఆరోపణలను పక్కనబెట్టి, ప్రభుత్వం సైలెంట్‌గా గైడ్‌లైన్స్ విడుదల చేయడం గమనార్హం. మొత్తానికి, హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలో ఈ హిల్ట్ పాలసీ అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నప్పటికీ, రాజకీయంగా ఎలాంటి రచ్చకు దారితీస్తుందో వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us