
తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు (పీఏసీఎస్) ఇకపై ఎన్నికలు నిర్వహించకుండా, నామినేటెడ్ పాలక మండళ్లనే ఏర్పాటు చేయాలనే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అమలు చేస్తున్న విధానాన్నే పీఏసీఎస్‌లకు కూడా వర్తింపజేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లు తెలుస్తోంది.
గ్రామీణ ప్రాంతాల్లో సహకార సంఘాల ఎన్నికలు రాజకీయంగా, ఆర్థికంగా భారీ ప్రభావం చూపుతుంటాయి. డైరెక్టర్ పదవుల నుంచి చైర్మన్ వరకూ ఎన్నికలు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారడం, డబ్బు ఖర్చు, రాజకీయ జోక్యం, ఫిరాయింపులు, గ్రామాల్లో విభేదాలు వంటి పరిణామాలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికలకు బదులుగా నామినేషన్ విధానంలో పాలకవర్గాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
సహకార చట్టం ప్రకారం ప్రతి పీఏసీఎస్‌కు 13 మందితో పాలకవర్గం ఏర్పాటు చేయాలి. ఇందులో చైర్మన్, వైస్ చైర్మన్‌తో పాటు 11 మంది డైరెక్టర్లు ఉంటారు. డైరెక్టర్ నియామకాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మూడు పోస్టులు తప్పనిసరిగా కేటాయించాల్సి ఉంటుంది. మిగిలిన పోస్టులను జనరల్ కేటగిరీలో భర్తీ చేయనున్నారు. ఈ పాలకవర్గాల నుంచే జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సమాఖ్యలు (డీసీఎంఎస్), మార్క్‌ఫెడ్, టెస్కాబ్ వంటి సంస్థలకు ప్రతినిధులు ఎంపిక అవవుతారు.
నామినేటెడ్ విధానంలోనైనా, పీఏసీఎస్‌ల్లో సభ్యులుగా ఉన్న రైతులకే పాలకవర్గాల్లో అవకాశం కల్పించాలనే నిబంధనను ప్రభుత్వం పాటించనుంది. సభ్యత్వం లేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ పదవులు ఇవ్వకూడదన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం వ్యవసాయ మార్కెట్ కమిటీల పాలకవర్గాలు పూర్తిగా నామినేషన్ విధానంలోనే ఏర్పాటు అవుతున్నాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిల సిఫారసుల ఆధారంగా జాబితాలు తయారై, వ్యవసాయ శాఖ మంత్రి ఆమోదంతో కమిటీలు నియమితులవుతున్నాయి. స్థానిక రాజకీయ సమీకరణలు, సామాజిక వర్గాల సమతుల్యతను పరిగణనలోకి తీసుకొని నియామకాలు జరుగుతున్నాయి. ఇదే విధానాన్ని పీఏసీఎస్‌లకూ వర్తింపజేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.
నామినేషన్ విధానం అమలులోకి వస్తే, సహకార సంఘాల్లోని అన్ని కీలక పదవులు అధికార పార్టీ కార్యకర్తలకే దక్కే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 207 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో 183 కమిటీలకు పాలకవర్గాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో దాదాపు మూడు వేల మందికి పైగా అధికార పార్టీ కార్యకర్తలకు పదవులు లభించాయి. ఇదే తరహాలో పీఏసీఎస్‌లు, డీసీసీబీలు, మార్క్‌ఫెడ్, టెస్కాబ్‌లకు కూడా నామినేటెడ్ పాలకవర్గాలు ఏర్పాటు చేస్తే రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మందికి పైగా కార్యకర్తలకు అవకాశాలు దక్కే పరిస్థితి ఏర్పడుతుందని అంచనా.
వీలైనంత త్వరగా పీఏసీఎస్‌లకు పాలకవర్గాల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సంక్రాంతి నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పీఏసీఎస్‌లకు ఎన్నికలు లేకుండా నామినేటెడ్ పాలక మండళ్లు ఏర్పాటు చేసే అంశంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..