Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరే శుభవార్త.. 9 లక్షల మందికి లబ్ది.. రెండ్రోజుల్లో డెసిషన్..!

తెలంగాణ ప్రభుత్వం వివాదంలో ఉన్న భూముల దరఖాస్తులను పరిష్కరించేందుకు సిద్దమవుతోంది. భూభారతి చట్టం తీసుకొచ్చాక భూముల దరఖాస్తు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈ క్రమంలో సాదా బైనామా దరఖాస్తుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా 9 లక్షల మంది రైతులు బెనిఫిట్ జరగనుంది.

Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం అదిరే శుభవార్త.. 9 లక్షల మందికి లబ్ది.. రెండ్రోజుల్లో డెసిషన్..!
Farmers

Updated on: Jan 27, 2026 | 8:17 PM

తెలంగాణలోని రైతులకు రేవంత్ సర్కార్ త్వరలో తీపికబురు అందించేందుకు సిద్దమవుతోంది. ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సాదా బైనమా భూములపై కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉన్న ఈ భూముల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని సీఎం రేవంత్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇందుకోసం పలు నిబంధనలను కూడా ప్రభుత్వం తొలగించనుంది. సాదా బైనమా భూముల పరిష్కారానికి అమ్మినవారి సంతకం, అఫిడవిట్ అవసరం లేకుండా ఇప్పటివరకు ఉన్న కఠిన నిబంధనలను తొలగించనుంది. దీనిపై త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. దీంతో ఇప్పటివరకు 9 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉండగా.. త్వరలోనే వీటిన్నింటినీ క్లియర్ చేయనున్నారు. ఈ క్రమంలో 9 లక్షల మంది రైతులకు లబ్ది జరగనుంది.

నిబంధన ఎత్తివేతతో తొలగనున్న అడ్డంకులు

ఇప్పటివరకు సాదా భనామా దరఖాస్తుల పరిష్కారానికి తెల్ల కాగితంపై భూమిని అమ్మిన వ్యక్తి మళ్లీ వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది. లేదా నోటరీతో ఒక అఫిడవిట్ అందించాల్సి ఉంటుంది. కానీ భూముల ధరలు పెరగడంతో అప్పట్లో భూములు అమ్మిన వ్యక్తులు సంతకం చేయడం లేదు. సంతకానికి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే సంతకం చేయడం లేదు. మరికొంతమంది అసలు సంతకమే చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో భూములు కొనుగోలు చేసిన రైతులకు ఈ నిబంధన పెద్ద కష్టతరంగా మారింది. ఈ రూల్ వల్ల వీటి దరఖాస్తులు పరిష్కారం కావడం లేదు. దీనిని గమనించిన ప్రభుత్వం.. ఆ కఠిన నిబంధనను తొలగించనుంది.

ఇక నుంచి కొత్త విధానం

ఇక నుంచి భూమి అమ్మిన వ్యక్తి సంతకం అవసరం లేదు. ఇక నుంచి పొషెషన్ విధానంలో ప్రభుత్వం భూమిని నిర్ధారించనుంది. ఇందుకోసం ఎమ్మార్వోలు, రెవెన్యూ సిబ్బంది పొలాల్లోకి వెళ్లి ఎంక్వైరీ చేస్తారు. భూమిని ఎప్పుడు కొనుగోలు చేశారు.. ఎప్పటినుంచి సాగు చేస్తున్నారు అనే విషయాలను ధృవీకరించనున్నారు. అలాగే ఇరుగుపోరుగు పోలాల వారి వాంగ్మూలం తీసుకోనున్నారు. ప్రస్తుతం భూమి ఎవరి ఆధీనంలో ఉంది అనే విషయాన్ని నిర్ధారించి దరఖాస్తులను క్లియర్ చేయనున్నారు. ఎప్పుడో భూమి కొనుగోలు చేస్తే ఇప్పుడు వాళ్లు వచ్చి అఫిడవిట్ ఇవ్వడం సరికాదని అధికారులు భావించారు. దీంతో ఆ నిబంధనను ఎత్తివేయాలని నిర్ణయించారు. అటు భూభారతి చట్టంలో భాగంగా పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పారదర్శకత కోసం వివాదాలను పరిష్కరించే ప్రక్రియను సులభతరం చేయనుంది. ఇందులో భాగంగా సాదా బైనామా భూములకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.