
తెలంగాణ ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం తీసుకుంది. అనర్హులైనవారిని గుర్తించి రేషన్ కార్డు రద్దు చేస్తోంది. గత కొంతకాలంగా రేషన్ కార్డుల ఏరివేత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపడుతోంది. అందులో భాగంగా కొంతమంది ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లింపుదారులు, అధిక జీతం పొందే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డులను పొందినట్లు అధికారుల పరిశీలనలో తేలింది. దీంతో వారి కార్డులను పౌరసరఫరాలశాఖ రద్దు చేస్తోంది. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విచారిస్తున్నారు. అనంతరం అనర్హులుగా తేలితే రద్దు చేస్తున్నారు. పరిమితికి మంచి భూమి ఉండటం, రూ.6 లక్షల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉండటం, ఐటీ రిటర్న్స్ దాఖలు చేసేవారిని గుర్తించి అనర్హులుగా ప్రకటిస్తున్నారు.
ఇక అధిక జీతాలు పొందుతున్న ప్రైవేట్ ఉద్యోగులను కూడా గుర్తించి రేషన్ కార్డు కట్ చేస్తున్నారు. కొంతమంది తప్పుడు సమాచారంతో రేషన్ కార్డు పొంది ఇన్నాళ్లూ ప్రభుత్వ పథకాలు పొందుతున్నారు. దీంతో వీరిని గుర్తించే ప్రక్రియను రేవంత్ సర్కార్ చేపట్టి అనర్హులను ఏరివేస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే కొంతమంది కూడా రేషన్ కార్డు పొంది ఉన్నారు. ఇక నెలకు రూ.50 వేల నుంచి రూ.2 లక్షల వరకు జీతాలు పొందే సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కొంతమంది ఇప్పటివరకు తమ తల్లిదండ్రుల రేషన్ కార్డుల్లో కొనసాగడం వల్ల వారి వివరాలు తెలియలేదు. కానీ తల్లిదండ్రుల నుంచి విడిపోయి ప్రత్యేకంగా కొంతమంది కార్డులు పొందారు. దీంతో వీరి వివరాలు ఇప్పుడు బహిర్గతం కావడంతో గుట్టు రట్టయింది. డేటా విశ్లేషణ, అధికారుల క్షేత్రస్థాయి పరిశీనలో వీళ్లు అనర్హులుగా ఉన్నట్లు బయటపడింది.
-గ్రామీణ ప్రాంతాల్లో 3.20 ఎకరాల కంటే ఎక్కువ తరి భూమి ఉండటం
-7.20 ఎకరాల కంటే ఎక్కువ కుష్కి భూమి ఉండటం
-వార్షిక ఆదాయం రూ.6 లక్షల కంటే ఎక్కువగా ఉండటం
-ఇన్‌కమ్ ట్యాక్స్ చెల్లిస్తూ ఉండటం