Vaccinated for COVID-19 : తెలుగు రాష్ట్రంలో కోవిడ్ టీకాల పంపిణీ ప్రక్రియ తిరిగి ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28న 400 కేంద్రాల్లో 37వేల మంది ప్రైవేటు వైద్యసిబ్బందికి టీకాలను అందించడానికి వైద్యఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.
తెలంగాణలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 1.55 లక్షల మంది టీకాలను పొందేందుకు కోవిన్ యాప్‌లో సమాచారాన్ని పొందుపర్చగా.. వీరిలో 42,915 మందికి సోమవారం టీకాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ 20,359 మంది మాత్రమే టీకాలను పొందారు.
ఇవాళ్టి నుంచైనా లక్ష్యానికి సాధ్యమైనంత దగ్గరగా వ్యాక్సిన్ అందించాలని ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా బుధవారం ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్యశాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఇందులో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. వారి ఆస్పత్రుల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా టీకా తీసుకోవాలని సూచించారు.
అయితే.. 29న శుక్రవారం కూడా కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని తెలిపారు. మళ్లీ 30న శనివారం సార్వత్రిక టీకా పంపిణీలో భాగంగా కోవిడ్ టీకాలకు విరామం. ఇదే క్రమంలో దేశవ్యాప్తంగా ఈ నెల 31న పోలియో టీకా పంపిణీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఈ తేదీన పోలియో టీకా పొందని చిన్నారుల కోసం.. ఆ తర్వాత వచ్చే నెల 1, 2 తేదీల్లోనూ పోలియో టీకాల పంపిణీ కొనసాగుతుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అంటే శుక్రవారం తర్వాత మళ్లీ వరుసగా 4 రోజుల పాటు కోవిడ్ టీకాల పంపిణీకి విరామం ఉంటుందని పేర్కొంది.