Telangana: గొర్రెల పంపిణీ స్కామ్‌.. నలుగురు ఉద్యోగులు అరెస్టు

గొర్రెల పంపిణీ స్కామ్‌లో నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. దర్యాప్తులో ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై.. నకిలీ బినామీ ఖాతాలతో దాదాపు రూ.2.10 కోట్ల ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని అధికారులు తేల్చారు. అక్రమాలన్నీ మొదటి విడతలోనే జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి...

Telangana: గొర్రెల పంపిణీ స్కామ్‌.. నలుగురు ఉద్యోగులు అరెస్టు
Sheep

Updated on: Feb 22, 2024 | 6:57 PM

తెలంగాణలో గొర్రెల పంపిణీ పథకం స్కాంలో నలుగురిని అరెస్ట్ చేసింది ఏసీబీ. ప్రైవేట్‌ వ్యక్తులతో కలిసి వీరు కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు గుర్తించింది ఏసీబీ. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ పథకంలో అక్రమాలు జరిగినట్టు గుర్తించింది తెలంగాణలో ఇటీవలే కొలువుతీరిన కాంగ్రెస్‌ ప్రభుత్వం. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ నలుగురిని అరెస్ట్‌ చేసింది. అరెస్టైన వారిలో కామారెడ్డి ఏరియా వెటర్నరీ హాస్పిటల్ అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, మరో అసిస్టెంట్ డైరెక్టర్ ఆదిత్య కేశవ సాయి, రంగారెడ్డి జిల్లా గ్రౌండ్ వాటర్ ఆఫీసర్ రఘుపతి రెడ్డి, అడల్ట్ ఎడ్యుకేషన్ డిప్యూటీ డైరెక్టర్ గణేష్‌ ఉన్నారు. ప్రైవేట్ వ్యక్తులతో వీరంతా చేతులు కలిపి.. 2కోట్ల 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులను దారి మళ్లించినట్టు ఏసీబీ గుర్తించింది.

గత ప్రభుత్వం 2017లో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించి 4.25 లక్షల మంది గొల్ల, కురుమలకు యూనిట్లు పంపిణీ చేసింది. లబ్ధిదారుల వాటాధనం పోగా ఇప్పటివరకు రూ.3,386 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం ఖర్చు చేసింది. అయితే ఇతర రాష్ట్రాల్లో గొర్రెల ఎంపిక, రవాణా, లబ్ధిదారులకు అప్పగింతలో భారీగా అక్రమాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే 2017-18లో వెటర్నరీ శాఖకు చెందిన 40 మంది అధికారులపై కేసులు నమోదు చేశారు. నామమాత్రంగా చర్యలు తీసుకున్నారు. కొందరిని ఇతర జిల్లాలకు బదిలీ చేశారు. నిధులు రికవరీ, శాఖాపరమైన చర్యలు తీసుకోలేదు. 2017 నుంచి 2020 వరకు మూడేళ్ల వ్యవధిలోనే 3.67 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీ జరిగింది.

అక్రమాలన్నీ మొదటి విడతలోనే జరిగినట్లు ఫిర్యాదులున్నాయి. 2 కోట్ల రూపాయలకు పైగా నిధులు దారి మళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఏపీలో గొర్రెలు విక్రయించిన యజమానులకు కాకుండా బోగస్‌ ఖాతాలకు నిధులు మళ్లించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. సంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, నల్గొండ జిల్లాల్లో అక్రమాలు జరిగినట్లు కాగ్‌ విచారణలో తేలింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…