Telangana Formation Day: తెలంగాణ అద్భుతంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం నాడు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ భవన్‌లో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. అలాగే, తెలంగాణ అభివృద్ధికి భారత ప్రభుత్వం అంకిత భావంతో పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో ఉన్న పేదవారికి రూ.3 చొప్పున ఐదు కిలోల బియ్యం, కరోనా నేపథ్యంలో మరో ఐదు కిలోల బియ్యాన్ని ఉచితంగా అందజేస్తున్నామని చెప్పారు.
తెలంగాణకు సంక్షేమ పథకాలు..
తెలంగాణలో జాతీయ రహదారుల అభివృద్ధికి ఒక లక్ష నాలుగు కోట్లు కేటాయించడం జరిగిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. రైతుల సంక్షేమం, ఆస్పత్రుల అభివృద్ధి, నరేగా ద్వారా ఉపాధి, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన సహకారం.. ఇలా 8ఏళ్లలో సమయం ప్రకారం తెలంగాణకు నిధులు ఇస్తున్నామని చెప్పారు కిషన్ రెడ్డి. హైదరాబాద్ కు రూ. 20వేల కోట్ల రీజనల్ రింగ్ రోడ్డు మంజూరు చేశామన్నారు. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తున్నామని, సబ్ కా సత్.. సబ్ కా వికాస్.. సబ్ కా విశ్వాస్ నినాదంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. అమరవీరుల ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తామన్నారు.
తెలంగాణ అమరవీరులకు అంకితం..
దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశ వ్యాప్తంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు జరుగుతున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. అందులో భాగంగా అనేక రాష్ట్రాల ఆవిర్భావ దినోత్సవాలను కేంద్రం నిర్వహిస్తోందని చెప్పారు. కేంద్ర మంత్రులు స్వయంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఈ మధ్యనే సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించామని గుర్తు చేశారు కిషన్ రెడ్డి. తెలంగాణ ఏర్పడి 8 ఏళ్లు పూర్తైన సందర్భంగా జరిపే ఈ వేడుకలు తెలంగాణ అమరవీరులకు అంకితం అని చెప్పారు కిషన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో బీజేపీ కీలక పాత్ర పోషించిందన్న ఆయన.. 168 మంది ఎంపీలు తెలంగాణ కోసం ఓటు వేశారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం తోడ్పాటునందిస్తోందన్నారు. రాష్ట్రానికి కేంద్రం పూర్తి మద్ధతు కొనసాగుతుంది.
తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో అమిత్ షా..
సాయంత్రం 6.30 గంటలకు అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో తెలంగాణ అవతరణ దినోత్సవాలను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారని చెప్పారు. ఇతర కేంద్ర మంత్రులు, తెలుగు, తెలంగాణ ప్రజలు కూడా పాల్గొంటున్నారని చెప్పారు. తెలంగాణ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు కూడా ఉంటాయని, తెలంగాణ వంటకాలతో భోజనాలను కూడా ఏర్పాటు చేశామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పుకొచ్చారు.
Live: #TelanganaFormationDay celebrations at Telangana Bhawan, New Delhi. https://t.co/n2RG1PbthH
— G Kishan Reddy (@kishanreddybjp) June 2, 2022